ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్న జానా

Update: 2018-03-13 06:45 GMT

ప్రభుత్వం ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందని సీఎల్పీనేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేయడం, ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఏ అధికారం కింద, ఏ రూల్ కింద సభ్యత్వాన్ని రద్దు చేశారో తెలుసుకుంటామన్నారు. న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈరోజు చీకటిదినంగా జానారెడ్డి అభివర్ణించారు. నిన్న జరిగిన సంఘటనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాని, స్పీకర్ కాదన్నారు. నిన్న సభలో జరిగిన సంఘటన గవర్నర్ పరిధిలోనిదన్నారు. తాను ప్రతిపక్ష నేతగా సంయమనం పాటిస్తున్నప్పటికీ, తనకు అందులో ఏపాత్ర లేకున్నా సస్పెండ్ చేయడమంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. తాము శాసనసభను వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటామని జానారెడ్డి చెప్పారు. తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పత్రికలు కూడా దాడి చేశారని రాయడం తగదన్నారు. తాము దాడి చేయడం సాధ్యంకాదని అన్నారు. హరీశ్ రావు వెల్ లోకి దూకి గవర్నర్ పై దాడికి ప్రయత్నిస్తే ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందీ? ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో గమనించాలన్నారు. నిన్న జరిగిందంతా ఒక డ్రామాగా ఉత్తమ్ అభివర్ణించారు. పార్టీలయినా మారండని, లేకుంటే ఇతర పార్టీల్లో ఉంటే సస్పెన్షన్లు తప్పవని కేసీఆర్ ఒకరకంగా హెచ్చరిస్తున్నారన్నారు. కేసీఆర్ బిడ్డ పార్లమెంటులో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేస్తుందన్నారు. తాము నిరసన చేస్తే కేసీఆర్ కు అంత ఎందుకంత ఆగ్రహమన్నారు. వీడియో ఫుటేజీలను బయటపెడితే అసెంబ్లీలో ఏం జరిగిందన్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నారు.

Similar News