ప్యాకేజీకి చట్టబద్ధత వినిపించింది.. కనిపిస్తుందా?

Update: 2016-11-30 23:01 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా అనాథగా ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి ఒకే ఒక ఆశాకిరణంగా ప్రత్యేక హోదా అనే పదం కనిపించింది. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చాలా వ్యూహాత్మకంగా క్రమంగా ఆ ఆశలపై నీళ్లు చిలకరించేశారు. ఒకవైపు చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమకు అన్యాయం జరుగుతున్నదని, మరోవైపు విపక్షాలు హోదానే కావాలని రకరకాల పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ అనే దానిని ప్రకటించారు. అయితే ఈ హోదాకు చట్టబద్ధత సాధించి, నిశ్చింతగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందుకెళ్లాలనే రాష్ట్రప్రభుత్వం కల మాత్రం అంత ఈజీగా తీరేలా కనిపించడం లేదు.

కేంద్రం అతికష్టమ్మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్యాకేజీని ప్రకటించింది. అక్కడితోనే తాము రాష్ట్రానికి ఎంతో ఒరగబెట్టేసినట్లుగా వెంకయ్య, తదితర భాజపా నాయకులంతా టముకు వేసుకున్నారు. అయితే రాబోయే అయిదేళ్లలో అవి సమకూరుస్తాం అని చెబుతున్న నేపథ్యంలో కేంద్రంలో సర్కారు మారితే సంగతేంటి? అనే భయంతో ఆ ప్యాకేజీకి చట్టబద్ధత ఉండాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తొలిరోజునుంచి చంద్రబాబు అదే డిమాండ్ ను వినిపిస్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం.. అసలు తమకేమీ వినపడనట్లుగా స్పందిస్తుండడం విశేషం.

అమరావతిలో కోర్‌కేపిటల్ శంకుస్థాపన పేరిట అరుణ్ జైట్లీని పిలిచి సత్కరించి ఆయన చేతుల మీదుగా ఓ కొబ్బరికాయ కొట్టించినా కూడా ఆయన గుండె ఏమాత్రం కరగలేదు. సదరు సమావేశంలో చంద్రబాబును ఆకాశానికెత్తేసి కీర్తించారే తప్ప.. ప్యాకేజీకి చట్టబద్దత గురించి వీసమెత్తు హామీ ఇవ్వలేదు.

చంద్రబాబు దీని గురించి పార్లమెంటు లో పోరాడాల్సిందిగా తెలుగుదేశం ఎంపీలకు కీ ఇచ్చి పంపిస్తే ఇన్నాళ్లకు ఎంపీ కేశినేని నాని ఆ విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించారు. ప్యాకేజికి చట్టబద్దత ఉండాలని కోరారు. ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం స్పందన లేదు. తెదేపా ఎంపీలందరి తరఫున సుజనాచౌదరి మాట్లాడుతూ.. తామంతా ప్రధానిని కలిసి ఈ విషయం విన్నవిస్తామని, ప్యాకేజీకి చట్టబద్ధత దక్కుతుందనే ఆశాభావం ఉన్నదని ఓ మాట వల్లించారు.

కానీ కేంద్రం స్పందిస్తున్న తీరు గమనిస్తే మాత్రం.. ఏపీ డిమాండ్ ను వారు ఏమాత్రమూ ఖాతరు చేస్తున్నట్లుగా లేదు. నిజానికి ప్యాకేజీ ప్రకటించి నెలలు గడుస్తున్నాయే తప్ప.. దాని తాలూకు ఫలాలేమీ ఇప్పటిదాకా కనిపించనేలేదు. కనీసం చట్టబద్ధత కూడా రాకపోతే గనుక.. కేంద్రం మరో వంచనకు పాల్పడుతున్నదనే అభిప్రాయం జనంలో కలిగే అవకాశం ఉంటుంది. అందుకే చట్టబద్ధత అనేది తెదేపా వారి డిమాండ్లలో ఇప్పుడు వినిపిస్తోంది.. అది అసలు ఆచరణలో కనిపిస్తుందా? అని పలువురు సందేహిస్తున్నారు.

Similar News