పురట్చితలైవికి తలైవా పరామర్శ, అదీ రహస్యమే

Update: 2016-10-17 05:03 GMT

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, భద్రత ఏర్పాట్లు లేకుండా.. సింపుల్‌గా ఆదివారం రాత్రి చెన్నయ్ అపోలో ఆస్పత్రికి వచ్చిన తలైవా రజనీకాంత్, అక్కడ చికిత్స పొందుతున్న పురట్చితలైవి అమ్మ జయలలిత ఆరోగ్యం గురించి పరామర్శించి వెళ్లారు. రజనీకాంత్ వచ్చే సమయానికి ఆస్పత్రి వద్ద సిద్ధంగా ఉన్న మంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులతోనూ , అపోలో ఆస్పత్రి వర్గాలతోనూ రజనీకాంత్ మాట్లాడి అమ్మ ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు.

రజనీకాంత్ రాక గురించి అంతా రహస్యంలాగా ఉంచారు. గత మంగళవారం జయలలిత పరామర్శకు రజనీకాంత్ రాబోతున్నట్లుగా బాగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఆస్పత్రి వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో రజనీకాంత్ ఆ ఆలోచన మానుకున్నారు. ఆదివారం రాత్రి రద్దీలేని సమయంలో ఎవరికీ , ప్రధానంగా మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండా రజనీకాంత్ వచ్చి వెళ్లిపోయారు. భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ప్రతి విషయాన్నీ గుంభనంగా ఉంచే పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు జయలలిత ఆరోగ్యం కుదుటు పడుతున్నట్లుగా వార్తలు, పుకార్లు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం గురించి అపోలో వర్గాలు అధికారికంగా బులెటిన్ విడుదల చేసి చాలాకాలమే అయింది. జయలలిత కళ్లు తెరిచారని, ఆరోగ్యంగా ఉన్నారనే వార్త తర్వాత అధికారికంగా అపోలో నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాకపోతే ప్రముఖుల పరామర్శలు మాత్రం సాగుతున్నాయి.

మరోవైపు లండన్ వైద్యుడు రిచర్డ్ ఇక్కడే ఉంటూ చికిత్సను కొనసాగిస్తున్నారు. ఎయిమ్స్ కు చెందిన ముగ్గురు డాక్టర్ల బృందం మొత్తం చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు ఫిజియోథెరపీ చేయడానికి సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇద్దరు మహిళా నిపుణులను పిలిపించారు. ఈ డాక్టర్ల పర్యవేక్షణలోనే వారు ఫిజియో థెరపీ చేస్తారని తెలుస్తోంది.

Similar News