పాకిస్తాన్ ... మన టీవీ ఛానెళ్లను నిషేదిస్తే వారికే నష్టం

Update: 2016-10-14 03:33 GMT

ఊరి మీద అలిగితే చెరువులో స్నానం చేయనని భీష్మించుకున్నాట్ట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. ప్రస్తుతం పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే మాదిరిగా కనిపిస్తున్నాయి. సర్జికల్ దాడులు, వాటి పర్యవసానమైన నిర్ణయాల్లో వివపరీతమైన అసహనానికి గురవుతున్న పాకిస్తాన్ అనేక అనాలోచిత నిర్ణయాలను కూడా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్‌లో భారతీయ టీవీ ఛానెళ్ల ప్రసారాలను ఈనెల 15 నుంచి పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. పాకిస్తాన్‌కు స్వయంగా ఉన్న వినోదరంగం చాలా పరిమితం. పాకిస్తాన్‌లో వినోదం మొత్తం భారతీయ హిందీ చిత్రాలు మరియు టీవీ ఛానెళ్ల మీదనే ఆధారపడి ఉంది. అక్కడ దేశవ్యాప్తంగా ప్రజలు చూసేది భారతీయ ఛానళ్లనే. భారతీయ టీవీ ఛానెళ్లు పాక్ కు చెందిన నటుల్ని తమ సీరియళ్లలోంచి తీసేసాయి గనుక.. ఆ ఛానళ్లనే తమ దేశంలో చూపించరాదని నిర్ణయం తీసుకోవడం పాకిస్తాన్ తమ ప్రజలను తామే ఇబ్బంది పెట్టుకున్నట్లుగా ఉంది.

నిజానికి పాకిస్తాన్ సినిమా రంగంలో కూడా 70 శాతం మార్కెట్ షేర్ భారతీయ సినిమాలదే ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు టీవీ ఛానెళ్ల మీద నిషేధం విధించిన పాక్, రేపు సినిమాల మీద కూడా వేటు వేసిందంటే గనుక.. భారత్ తో వైరం పెట్టుకున్న ప్రభావం.. జాతీయ వ్యాప్తంగా వారి దేశంలోని ప్రతి పౌరుడికి తెలిసి వస్తుంది. అప్పటికి కేవలం పాక్ ఛానెళ్లు మాత్రమే మిగిలి ఉంటాయి గనుక.. వారు భారత్ గురించి ఎంత ప్రతికూలంగా అయినా ప్రచారం చేసుకోవచ్చు. కాకపోతే.. జనం మాత్రం తమ జీవితాలకు కనీసం దక్కే వినోదాన్ని కూడా ప్రభుత్వం దూరం చేశారనే భావనతో ఉంటారు.. అది పాక్ సర్కారుకు ఇబ్బంది కరమే కావొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News