దేవుళ్లను రచ్చకీడ్చటం ఎందుకు?

Update: 2016-10-16 06:40 GMT

నాయకులు తమ అభిప్రాయాలు చెప్పుకోవడాన్ని ఎవ్వరూ అభ్యంతర పెట్టరు. అయితే మధ్యలో ఏదో సంచలనం సృష్టించడం కోసం దేవుళ్లను రచ్చకీడ్చే ప్రయత్నం చేస్తేనే కంటగింపుగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాజ్యమేలడం ప్రారంభించిన తర్వాత.. వారి మీద కినుక ఉన్న వారంతా ఏదో ఒక రకంగా హిందూ దేవుళ్లకు ముడిపెడుతూ రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం .. దాని మీద కొన్నాళ్ల పాటూ చర్చోపచర్చల్లో దేశం గాడితప్పిపోతూ ఉండడం.. వేల లక్షల మంది తమ అభిప్రాయాలు వెల్లడించేరూపంలో వేల పనిగంటలు వృథా కావడం ఇదంతా తరచూ జరుగుతున్నదే.

అలాంటిదే మరొక కొత్త వివాదాన్ని తెర మీదకు తేవడానికి కర్ణాటక మంత్రి ఒకరు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కన్నడ యువజన, క్రీడల మంత్రి ప్రమోద్ మధ్వరాజ్ ఉడుపిలో నిర్వహించిన వాల్మీకి జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ.. పురాణ పురుషులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా మాంసాహారులే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కావాలనే ఈ మాటలు అంటున్నట్లు ఆయన చెప్పారు. అంటే వివాదం రేకెత్తడానికే అన్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయం మీద దేశమంతా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని కూడా తన అభిప్రాయంగా చెప్పారు.

అయినా ప్రశాంతంగా ఉన్న నీటి కొలనులో రాయి విసిరి ప్రకంపనలు సృష్టించడం లాంటి అలవాటు కాకపోతే.. ఈ విషయాన్ని ఇప్పుడు చర్చకు తేవాల్సిన అవసరమేంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనకు మాంసాహారం మంచిదనే అభిప్రాయం ఉంటే అదరూ అదే తినాలని చెప్పుకోవచ్చు కదా అని అంటున్నారు. రాముడు, కృష్ణుడు శాకాహారులు అని ఎవరైనా అని ఉంటే దాన్ని ఖండించడానికి ఇలాంటి వాదనలు వచ్చిన పర్లేదు గానీ.. నిమ్మళంగా ఉన్న సమాజంలో ఒక సంచలనం సృష్టించడానికి ఇలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

Similar News