ఇన్నాళ్లకు ఏపీ సర్కార్ కూడా నిద్ర మేల్కొన్నట్లుగా కనిపిస్తోంది. తాము అడగకపోయినా.. కేంద్రం నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తుందనే ఆలోచన నుంచి.. తమకు కావాల్సినది ఏమిటో.. తమకు అర్హమైనది ఏమిటో అడిగి పుచ్చుకోవాలనే ధోరణికి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వైఖరి, తాజాగా కేంద్రాన్ని అడగడానికి ఏపీ సర్కార్ నిర్ణయించుకున్న అంశాలు అన్నీ... తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లనుంచో చేస్తున్న ప్రయత్నం అడుగుజాడల్లోనే ఉండడం విశేషం.
కేంద్రాలు రాష్ట్రాలకు ఇచ్చే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని కేంద్రాన్ని కోరడానికి తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్ణయించారు. ఈనెల 18వ తేదీనుంచి మూడు రోజులు కేంద్రం ఆర్థికమంత్రుల సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో కేంద్రం ఆర్ధికమంత్రి జైట్లీ వద్ద ఈ ప్రతిపాదన పెట్టాలని యనమల అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. కేంద్రం ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 3 శాతం స్థానే 3.5 శాతం ఇవ్వాలనేది వీరు కోరుతున్నారు. ఇలా పెంచడం వలన.. రాష్ట్రాలు మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా రుణాలు తెచ్చుకోవడానికి వెసులుబాటు ఏర్పడుతుంది.
నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంతోకాలంగా కోరుతోంది. ఈటెల రాజేందర్ హస్తినలో ఎలాంటి సమావేశాలకు హాజరైనా సరే.. పనిలో పనిగా.. ఈ ఎఫ్‌ఆర్‌బీఎం అంశాన్ని కూడా లేవనెత్తుతూ ఉంటారు. కేసీఆర్ కేంద్రానికి లేఖలు కూడా రాశారు. అచ్చంగా అదే ఫార్మాట్‌ను ఏపీ సర్కార్ చాలా ఆలస్యంగా ఇన్నాళ్లకు ఫాలో అవుతున్నది. ఎఫ్‌ఆర్‌బీఎం వెసులుబాటు కావాలంటూ చంద్రబాబు లేఖ రాశారు. యనమల ఆ అంశాన్ని ప్రస్తావించబోతున్నారు.
మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కలిసి తమ డిమాండ్ విషయంలో విజయం సాధిస్తారో లేదో చూడాలి.