తలాక్ నిషేధానికే జై కొట్టిన లోక్ సత్తా అధినేత

Update: 2016-10-22 05:18 GMT

లోక్ సత్తా.. ఇది మీ సత్తా అంటూ ఎన్నికల్లోకి అడుగు పెట్టారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ.. పోటీ చేసీ చేసీ ప్రజల్లో మార్పు తీసుకురాలేక విసిగిపోయి.. చివరకు బరిలోంచే తప్పుకునేశారు. చివరకు ఈ పార్టీ ఎక్కడుందబ్బా.. అనుకునే వారి కోసం అప్పుడప్పుడూ నేనున్నానంటూ గుర్తు చేస్తుంటారు. అప్పుడెప్పుడో ఎన్నికల్లో పోటీ చేసేది లేదు అని అస్త్ర సన్యాసం చేసేసి పార్టీపై కొండంత ఆశలు పెట్టుకున్న కొందరినీ నిరుత్సాహపరచిన తర్వాత.. మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి పుణ్యమా అని మళ్లీ తెరపైకి వచ్చారు లోక్ సత్తా వ్యవస్థాపకుడు..

ఉమ్మడి పౌరస్మృతిలో తలాక్ విధానం రద్దుపై ఇప్పటికే ముస్లిం లా బోర్డులు, కేంద్రం మధ్య వాడీ వేడీ చర్చ నడుస్తోంది. ఇదే అదనుగా మిగతా పార్టీలన్నీ దీన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడేసుకుంటున్నాయి. అలాంటి సమయంలో తలాక్ నిషేధానికే జై కొట్టారు జేపీ. ఎప్పుడూ ముస్లిం లాబోర్డులు, కేంద్రం ప్రతినిధుల వాదనేనా.. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిపై జరుగుతున్న చర్చ మతాలకతీతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల్ని, మహిళల సమానత్వాన్ని, వారి పిల్లల భద్రతను పరిరక్షించేందుకు చట్టాలు అవసరమని, మతం, సంప్రదాయం పేరుతో కొందరి హక్కులకు, పిల్లల భవిష్యత్తుకు సమస్యలు సృష్టించినప్పుడు ఆ చట్టాలు అవసరమవుతాయని అన్నారు.

మత విశ్వాసాలకు సంబంధించిన మిగతా అంశాల్లో ప్రభుత్వాల ప్రమేయం ఏమాత్రం ఉండదని పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో జేపీ అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటు బ్యాంకును తమవైపు లాగేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలన్నీ తప్పుబడుతున్న సమయంలో తన అభిప్రాయం చెప్పడానికి ఏమాత్రం వెనకాడలేదు జేపీ. ఎన్నికల్లో పోటీకి నిలబడి ముస్లిం ఓటర్లను ఆకర్షించాల్సిన పనిలేదనుకున్నారేమో తనకు న్యాయం అనిపించిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

అంత బాగానే ఉన్నా తలాక్ విధానం రద్దు కుదరదంటున్నాయి ముస్లిం బోర్డులు, కానీ ఈ పద్ధతిని రద్దు చేయాల్సిందేనని పట్టు బడుతోంది కేంద్రం.. దీంతో ఉమ్మడి పౌరస్మృతి చట్టం వస్తుందా, రాదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. దీనిపై రాజ్యాంగ బద్ధంగా ముందుకెళ్లే యోచనలో ఉంది మోడీ సర్కారు.

Similar News