జగన్ పాఠం నేర్చకోవాలంటున్న యనమల

Update: 2016-12-09 13:35 GMT

కోర్టు ఆదేశాలను చూసి అయినా విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి పాఠం నేర్చుకోవాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. పాఠం నేర్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర గురించి విచారించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో యనమల స్పదించారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన పాత్ర గురించి విచారణ జరిపించాలంటూ, ఆయన పాత్రను తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు చంద్రబాబును రచ్చకీడ్చాలని చూస్తున్న వైకాపా కుయత్నాలకు చెంపపెట్టు అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం మీద బురద చల్లడం, తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రంలో తాను అధికారంలోకి రాలేననే సంగతి జగన్ తెలుసుకోవాలని యనమల హితవు చెప్పారు.

కోర్టు తీర్పు చంద్రబాబునాయుడుకు అనుకూలంగా రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా స్పందిస్తున్నారు. జగన్ మీద ప్రత్యారోపణలను వెల్లువెత్తిస్తున్నారు.

Similar News