గాలి కి ఊహించని షాక్

Update: 2017-02-28 04:00 GMT

కర్ణాటకలో బీజేపీనేత గనుల యజమాని గాలి జనార్థన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తనకు ఆప్తమిత్రుడైన శ్రీరాములు, సోదరుడు కరుణాకర్ రెడ్డి మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. ఒక భూమి విషయంలో వీరిద్దరూ కోర్టు కెక్కడంతో గాలి కుటుంబం నుంచి శ్రీరాములు బయటకు వస్తాడన్న వార్తలతో బళ్లారి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

గాలి సోదరుడితో విభేదాలు....

బళ్లారి నియోజకవర్గం గాలి కుటుంబానికి కంచుకోట. శ్రీరాములు గాలి కుటుంబానికి కొన్నేళ్లుగా అండగా ఉంటూ వస్తున్నారు. శ్రీరాములకు కూడా బళ్లారి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అక్రమ గనుల వ్యవహారంలో గాలి జనార్ధన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు కూడా ఆయనే దగ్గరుండి గాలి వ్యవహారాలను చూశారు. ఇటీవల జరిగిన గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. అటువంటి శ్రీరాములు, గాలి కరుణాకర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తడంతో గాలి కుటుంబానికి కొంత ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. రాజకీయంగా ఎదురుదెబ్బేనంటున్నారు. అయితే శ్రీరాములును బుజ్జగించేందుకు గాలి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట. గాలి కరుణాకర్ రెడ్డిపై భూ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని శ్రీరాములుపై విమర్శలున్నాయి. మరి తన సోదరుడు కరుణాకర్ రెడ్డికి, సోదర సమానుడైన శ్రీరాములకు మధ్య గాలి సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తారా? లేక సోదరుడి కోసం శ్రీరాములును గాలికి వదిలేస్తారా? తెలియాల్సి ఉంది.

Similar News