గద్దర్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్...!

Update: 2017-12-07 13:30 GMT

టీఆర్ఎస్ పక్కన పెట్టిన వర్గాలను కాంగ్రెస్ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించాలన్న కసితో ఉన్న పార్టీ హైకమాండ్ ఆ మేరకు హస్తిన నుంచే పావులు కదుపుతోంది. తెలంగాణ తాము ఇచ్చినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్ ను సొమ్ము చేసుకోలేకపోయారన్నది హైకమాండ్ భావన. తెలంగాణ ఇచ్చినప్పుడే చేతులెత్తేైసిన నేతలు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ అదే రీతిలో వ్యవహరిస్తారని టెన్ జన్ పథ్ అనుమానిస్తుంది. అందుకోసమే తెలంగాణపై కాంగ్రెస్ యువనేత రాహుల్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన వారిలో కొందరినిన టీఆర్ఎస్ పక్కన పెట్టింది. అయితే వారిని అక్కున చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పీసీసీ తో సంబంధం లేకుండానే అధిష్టానం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అనేకమందినేతలు, మేధావులతో భేటీలు....

ఇటీవల కాలంలో రాహుల్ దూతలు తెలంగాణలో విపరీతంగా పర్యటిస్తున్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయాలని రహస్యంగా సమాలోచనలు చేస్తున్నారు. దాదాపు యాభై మంది నేతలతో రాహుల్ దూతలు సమావేశమయ్యారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ తో కాంగ్రెస్ ఢిల్లీ దూతలు భేటీ అయ్యారు. పెద్దపల్లి పార్లమెంటు నియోకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన ముందు ప్రతిపాదన పెట్టారు. ఇక తెలంగాణ ఇంటిపార్టీ నేతలు చెరకు సుధాకర్, యెన్నం శ్రీనివాసులురెడ్డితో కూడా చర్చలు జరిపారు. వారికి కూడా సీట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మాజీ జస్టిస్ చంద్రకుమార్, విమలక్క తోపాటు పలు ప్రజాసంఘాల నేతలతో కూడా వీరు చర్చలు జరిపారు. అలాగే తెలంగాణలోని కొందరు మేధావి వర్గంతోనూ సమాలోచనలు జరిపారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అందరినీ ఒకటి చేసే ప్రయత్నంలో ఉన్నారు ఈ నేతలు. నేరుగా ఢిల్లీ నుంచే తమకు టిక్కెట్ల ఆఫర్లు రావడంతో వీరిలో కొందరు మద్దతును వెంటనే తెలపగా, గద్దర్ లాంటి వారు మాత్రం తమకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే కొందరు విద్యార్థి సంఘనేతలతోనూవీరు చర్చించినట్లు తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఢిల్లీ నుంచే ఏకం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రారంభించింది.

Similar News