కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ సారథ్యం కోరుకుంటూ.. చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తూ.. పార్టీ కోసం ఇటీవలి కాలంలో చాలా దూకుడుగా ఖర్చు చేసిన వ్యక్తి. కేవలం కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాదు. ధన రూపేణా కూడా బాగానే ఖర్చు పెట్టారు. కీర్తి పార్టీకి కట్టబెట్టారు. అయితే ఎప్పుడు టీపీసీసీ సమావేశం జరిగినా.. ఎవరో ఒకరు పెద్ద నాయకుల మీద విమర్శలతో విరుచుకుపడకుండా మాత్రం కోమటిరెడ్డి ఉండరుగాక ఉండరు.
అలాంటి కోమటిరెడ్డి శుక్రవారం నాడు ఓ గట్టి సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీనుంచి అధికార గులాబీ పార్టీలోకి ఫిరాయించిన వారి మీద ఆయన ఫోకస్ పెట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ ప దవులకు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలని, వారు అలా గెలుపొందితే గనుక.. తాను 2019 ఎన్నికల్లో పోటీకి దిగకుండా తప్పుకుంటానని ఆయన సవాలు విసురుతున్నారు. తను పూర్తిగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పడం వంటి సవాలు ఇది.
అయితే మళ్లీ గెలవడం అనేది ప్రస్తుతం ఉన్న వాతావరణంలో తెరాస బ్రాండ్ ఉన్నవారికి పెద్ద విషయం కాకపోవచ్చు గానీ.. మళ్లీ ఎన్నికలు.. ఖర్చులు ఇలాంటి వ్యవహారానికి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఎందరు సిద్ధంగా ఉంటారు అనేది సందేహమే. ఎవరికి వారు సవాలు విసిరినది తమకు కాదులే అన్నట్లుగా మౌనం పాటిస్తారే తప్ప.. వాస్తవంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ స్పందిచకపోవచ్చునని జనం అనుకుంటున్నారు.