కత్తులు కాదు సబ్బులు నూరుతున్న పార్టీలు!

Update: 2016-12-09 11:43 GMT

అవును మరి...! ఎక్కడైనా శాసనసభ సమావేశాలు మొదలు కాబోతున్నాయంటూ పాలక, విపక్ష పార్టీలు పరస్పరం తెనాడుకోవడానికి కత్తులు నూరుకుని సిద్ధమవుతారని అంతా అనుకుంటారు. కానీ.. అసెంబ్లీ మొదలైతే చాలు.. మేనిఫెస్టో హామీలు అమలు చేయని తెరాసను ఉతికి ఆరేస్తాం అని విపక్ష కాంగ్రెస్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చిన చరిత్రలేని, కోర్టు కేసుల ద్వారా ప్రాజెక్టుల పనులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ ను కడిగేస్తాం అని తెరాస మంత్రులు దూకుడుగా ప్రకటిస్తున్న తరుణంలో ఇలాంటి సందేహమే కలుగుతుంది. వీరు ఉతకడమూ, కడగడమూ మాత్రమే చేసేట్లయితే.. కత్తులు నూరడం కాదు కదా.. సబ్బులు నూరితే సరిపోతుందని అనిపిస్తుంది.

అసెంబ్లీ సమావేశాల విషయంలో ఒక ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ ఊహించింది జరగలేదు. తెరాస వ్యవహరించే ఒంటెత్తు పోకడలను బట్టి అసెంబ్లీ నిర్వహించడం అనే డిమాండు వింటే కేసీఆర్ సర్కారు కాస్త జంకుతుందని వారు అనుకున్నారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని వారు తొలివారంలో డిమాండ్ చేస్తే కొన్ని రోజుల వ్యవధిలోనే కేసీఆర్ గవర్నరును కలిసి సమావేశాల గురించి చర్చించారు. ఆ వార్తలు రాగానే, అధికారికంగా ప్రకటించలేదే.. అని కాంగ్రెస్ వారు భీష్మించారు. రెండోరోజు ప్రకటన కూడా వచ్చింది. ఇవాళ శుక్రవారం నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే వీరు ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయడానికి సిద్ధపడ్డారా లేదా అనేది మాత్రం సందేహంగానే ఉంది. చర్విత చరణమైన పాత ఆరోపణల్నే ఇప్పటికీ పట్టుకు వేలాడుతూ ఉంటే అసెంబ్లీలో వీరి పోరాటాన్ని ప్రజలు ఆసక్తి గా చూడడం కూడా జరగదు.

అదే సమయంలో హరీష్ రావు కాంగ్రెస్ మీద ఎదురుదాడికి సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎక్కువభాగం.. ఆయన శాఖలకు చెందిన నీటి పారుదల పథకాల మీదనే ఉన్నాయి. మరణించిన వారితో కూడా కోర్టు కేసులు వేయించి.. పనులు జరగకుండా అడ్డు పడుతున్నారంటూ.. పొలాలకు సాగు నీరు రానివ్వకుండా చేస్తున్నారంటూ అసెంబ్లీ మొదలు కాగానే కాంగ్రెస్ ను కడిగేస్తాం అని ఆయన ప్రతిన బూనుతున్నారు.

ఇరు వర్గాలూ ఈ దూకుడు మీదుండగా.. 16 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు.. ఎంత జోరుగా జరుగుతాయనేది సందేహంగా ఉంది.

Similar News