కడియం నర్సరీలకు కేంద్రం షాక్

Update: 2017-02-04 04:59 GMT

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలు కష్టాల్లో పడ్డాయి. దేశంలో పేరొందిన కడియం నర్సరీలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ నే ఇచ్చింది. జీఎస్టీ పన్నుల విధానంలోకి నర్సరీలను చేర్చడంతో నర్సరీ రైతులు ఆందోళన చెందుతున్నారు. నర్సరీ మొక్కలు అమ్మకాలపై దాదాపు 15 శాతం పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించడంతో నర్సరీ రైతులు తమకు కష్టాలు వచ్చినట్లేనని ఆవేదన చెందుతున్నారు. నర్సరీలు అంటే వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలని కేంద్ర గుర్తించకపోవడం శోచనీయమంటున్నారు.

వేలాది మందికి ఉపాధి

కడియం నర్సరీలో వేలాది పండ్లు, పూల మొక్కలను పెంచి వాటిని దేశవ్యాప్తంగా విక్రయిస్తారు. కడియం నర్సరీ అంటే అంత పేరుంది. ఏ రకం మొక్కైనా ఇక్కడ లభిస్తుంది. అది కడియం స్పెషాలిటీ. ప్రభుత్వ పరంగా ఎలాంటి మద్దతు లేకున్నా తమ కష్టాన్నే నమ్ముకుని ఇన్నాళ్లూ మొక్కలను బతికించిన ఘనత కడియం నర్సరీ రైతులది. తమ నర్సరీలనే ప్రయోగశాలను చేసుకుని కొత్తకొత్త మొక్కలను సృష్టించి పేరుతెచ్చుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. అయితే వ్యవసాయంతో సమానంగా తమకూ రాయితీలు ఇవ్వాలని నర్సరీ రైతులు కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కాని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా...ఇప్పడు జీఎస్టీలో నర్సరీలను చేర్చడంలపై వారు మండిపడుతున్నారు. నర్సరీలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారని, నర్సరీలు పన్నుల వల్ల నష్టాల బాట పడితే ఉపాధి కోల్పోయే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కడియం నర్సరీ రైతుల వందల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని నర్సరీలను నిర్వహిస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయల రుణాలను తీసుకున్నారు. ఇప్పడు కేంద్రం తాజా నిర్ణయం మొక్కల అమ్మకాలపై పడుతుందని భయపడుతున్నారు. దీనిపై ఆందోళనకు దిగుతామంటున్నారు. నర్సరీలను వ్యవసాయ అనుబంధ రంగంగానే గుర్తించి, జీఎస్టీ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Similar News