ఓట్లు కురిపించే పథకంపై, చంద్రబాబు స్పెషల్ ఫోకస్

Update: 2016-11-29 22:00 GMT

చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన చంద్రన్న బీమా పథకం సరిగ్గా ఆచరణలోకి వచ్చినట్లయితే .. ఇబ్బడి ముబ్బడిగా ఓట్లను రాబట్టగల పథకం అవుతుందని ఎవరైనా ఊహించవచ్చు. దానికి తగినట్లుగానే చంద్రబాబునాయుడు ఆ పథకం అమలుగురించి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అధికారుల్ని కూడా ఆ మేరకు ఉరుకులెత్తిస్తున్నారు.

మంగళవారం చంద్రన్న బీమా కార్యక్రమం గురించి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, అమలు వివరాలు రియల్‌టైమ్‌లో ప్రజలకు చేరేలా ప్రణాళికలు రచించాలని సూచించడం విశేషం. క్లెయిమ్ చేయడానికి అవసరమయ్యే పత్రాలు ఇవాల్సిన శాఖలన్నీ సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు. కాల్ సెంటర్ దగ్గరనుంచి పరిహారం చెల్లించే బీమా కంపెని వరకూ ప్రతి శాఖా సేవా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. బీమాదారుడి మరణ సమాచారం తెలిపేందుకు 155214 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఈ కాల్ సెంటర్ నంబర్ ప్రతి ఒక్కరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. బీమాదారుని మరణ సమాచారం తెలిసిన 48 గంటలలోపు మండలాల్లోని బీమామిత్ర ద్వారా అంత్యక్రియలకు రూ.5000 అందించడమే కాకుండా క్లెయిమ్‌కు కావలసిన పత్రాల జారీచేయడంలో కూడా ‘బీమామిత్ర’ ఉద్యోగులు పర్యవేక్షిస్తారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రమాదంలో మరణించిన వారి క్లెయిమ్‌కు అవసరమైన ప్రాథమిక నివేదిక, దర్యాప్తు, శవ పంచనామా నివేదిక, మరణ ధృవీకరణ పత్రం నిర్ణీత గడువులోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ధృవపత్రాల జారీలో జాప్యం కారణంగా పరిహారం అందడంలో ఆలస్యం జరిగినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చంద్రన్న బీమా వెబ్‌పోర్టల్‌ను సీయం డాష్‌బోర్డ్‌తో అనుసంధానం చేసి, దృవపత్రాలన్నింటినీ ఆయా శాఖలు నేరుగా చంద్రన్న బీమా వెబ్‌పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని అన్నారు. పంచాయతిరాజ్, మున్సిపల్ శాఖలు జనన, మరణ రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. చంద్రన్న బీమాపై ప్రతి నెలా కార్మిక, సెర్ప్, పంచాయతిరాజ్, పురపాలక, పొలీస్, వైద్య, బీమా సంస్థల ప్రతినిధులు సమీక్షించుకుని తనకు నివేదిక సమర్పించాలని చెప్పారు. ప్రతినెలా మొదటి వారంలో పరిహారం అందించాలని అన్నారు.

Similar News