ఒక్క క్షణం ఆలోచన...ఆత్మహత్యకు దారితీసిందా?

Update: 2017-02-25 10:58 GMT

చేతినిండా డబ్బులున్నాయి. వాటిని కాజేద్దామన్న క్షణంలో వచ్చిన ఆలోచన అతనిని మరణానికి కారణమైంది. మంచిపేరు తెచ్చుకుని కూడా చివరకు పరాయి డబ్బు కోసం పాకులాడి తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. విజయనగరం జిల్లా అయ్యన్నపేటకు చెందిన జి.సంతోష్ కుమార్ సిస్కో సంస్థలో రికవరీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. నిత్యం తాను వివిధ సంస్థల నుంచి డబ్బులు సేకరించి యాక్సిస్ బ్యాంకులో జమ చేయడం అతని డ్యూటి. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న సంతోష్ కుమార్ పట్ల డబ్బులు చెల్లించే వ్యాపారులకు కూడా నమ్మకం ఏర్పడింది. లక్షల రూపాయలు ఇచ్చినా వెంటనే జమ చేస్తుండటంతో ఆయనకు ఆ ప్రాంతంలో మంచిపేరొచ్చింది.

పారిపోదామనుకుని...మళ్లీ....

కాని సంతోష్ కుమార్ ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకున్నాడు. అయన్నపేటలోని శివారు ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకుని కన్పించాడు. ఆరోజు నాతవలస చెక్ పోస్ట్ నుంచి 30 లక్షలు, జయనగరంలోని కొందరు వ్యాపారుల నుంచి 16 లక్షల సొమ్మును కలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఎంతకూ సొమ్ము జమ అయినట్లుగా వ్యాపారులకు మెసేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్ కుమార్ కోసం వెతుకుతుండగా చెట్టుకు వేలాడుతూ శవమై పోలీసులకు కన్పించాడు. సొమ్ము కోసం కొందరు సంతోష్ ను హతమార్చి చెట్టుకు ఉరేసి ఉండొచ్చని పోలీసులు తొలుత అనుమానించారు. దీంతో సంతోష్ కాల్ డేటాను సేకరించారు. సంతోష్ మిత్రులను కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయట పడింది. ఆరోజు సంతోష్ కుమార్ వద్ద ఉన్న 46లక్షలను కాజేద్దామని భావించాడు. తన మిత్రులైన ఆనంద్, శ్రీనివాస్ లను సంప్రదించాడు. తన వద్ద 46 లక్షలున్నాయని, వీటిని ఏం చేద్దామని ముగ్గురూ మాట్లాడుకున్నారు. చివరకు సొమ్మును కాజేద్దామనుకునే నిర్ణయానికి వచ్చారు. అయితే తనను పోలీసులు పట్టుకుంటారని భావించిన సంతోష్ ఆ సొమ్మును తన మిత్రులకు ఇచ్చి వేరే ప్రాంతానికి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే మధ్యలో అతని ఆలోచన మారింది. తనకు..తన కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని భావించాడు. పోలీసులు అరెస్ట్ చేస్తే పరువు పోతుందని అనుకుని తానే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణంలో వచ్చిన చెడ్డ ఆలోచన సంతోష్ జీవితాన్ని బలిగొంది. బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు స్నేహితుల నుంచి సొమ్మును రికవరీ చేశారు.

Similar News