ఇది రక్తసిక్త ఉదయం : మృత్యు హైవేలు

Update: 2016-10-15 04:00 GMT

తెలుగు రాష్ట్రాలకు శనివారం ఉదయం రక్తసిక్తంగా తెల్లారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం తెల్లవారుజాము, ఉదయం వేళల్లో జరిగిన మూడు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. నల్గొండ, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రమాదాలు జరిగాయి.

నల్గొండ జిల్లాలో స్విఫ్ట్ కారులో వస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. కారు కల్వర్టు గోడను ఢీకొట్టి కాలువలోకి పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వీరంతా మెదక్ జిల్లా కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు.

కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద ఓ స్కార్పియో వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. వీరంతా హైదరాబాదుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాదుకు చెందిన సుబ్బరాజు, రంగరాజు తదితరులుగా మృతులను గుర్తించారు. వీరంతా తిరుమలకు భగవద్దర్శనార్థం వెళ్లి తిరిగి హైదరాబాదు వస్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో నలుగురు మరణించారు.

తూర్పుగోదావరి జిల్లాలో మరో రోడ్డుప్రమాదంకూడా జరిగింది. విజయవాడనుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రెవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పంటకాల్వలోకి దిగింది. 20 మంది గాయపడ్డారు.

 

హైవేలు బాగున్నాయి.. రక్షణ ఏర్పాట్లేవీ...

ప్రభుత్వాలు కాంట్రాక్టులు కమిషన్లకు కక్కుర్తి పడి భారీ మొత్తాలు వెచ్చించి హైవేలను చాలా చక్కగా వేయించేస్తున్నాయి. ప్రయాణానికి చాలా సౌకర్యంగా ఉండే హైవేలు.. అధికవేగంతో వెళ్లేలా మనల్ని ఊరించేలా ఉంటుంటాయి. అయితే.. ప్రమాదాల నివారణకు తగిన రక్షణ ఏర్పాట్లు మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉండడం చాలా పెద్ద అంశంగా మారుతోంది. ప్రధానంగా జాతీయ రహదార్లున్న చోట కూడా ఊర్లుండే చోట బారికేడ్‌లు లాంటివి లేకపోవడం పెను ప్రమాదాలకు దారితీస్తుంది. అడ్డంగా ఎవరో ఒకరో వచ్చేయడం .. వారు ప్రమాదానికి గురి కావడం లేదా వారిని తప్పించే ప్రయత్నంలో వాహనాలు ఘోర ప్రమాదాలకు గురికావడం రివాజుగా మారుతోంది. కేవలం హైవేలను వేగవంతమైన ప్రయాణానికి అనుకూలంగా తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా.. వాటిపై వాహనాలు అధిక వేగంతోనే వెళ్తాయి అనే అంచనాతో తదనుగుణమైన రక్షణ ఏర్పాట్ల మీద కూడా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

Similar News