ఆపరేషన్ హైదరాబాద్ స్టార్ట్

Update: 2018-02-28 02:57 GMT

ఆపరేషన్ హైదరాబాద్ మళ్లీ మొదలైంది. అడపాదడపా కాకుండా ఈ సారి పెద్దఎత్తున నిర్వహించాలని పోలీసులు సంకల్పించారు. ఏ ఒక్కరిని, ఏ బస్తీ వదలకూడదని డిసైడ్ అయ్యారు. బూట్ల చప్పుడు.. తలుపు శబ్దం వింటేనే నేరాగాళ్ల గుండె ఆగిపోవాలంటున్నారు. దోచుకోవాలని సిటీకి వచ్చే నేరస్తులైనా.. తప్పు చేయాలని భావించే వారైనా సరే ఆలోచనకు ముందు కార్డాన్ సెర్చ్ గుర్తుకు వచ్చేలా చేస్తామంటున్నారు మూడు కమీషనరేట్ల పోలీసులు.

ఠారెత్తిస్తున్న పోలీసులు....

కార్డాన్ సెర్చ్ మళ్లీ మొదలైంది. కాస్త విరామం తరువాత పోలీసులు తనిఖీల పేరుతో ఠారెత్తిస్తున్నారు. దోచుకోవాలని వచ్చిన నేరగాళ్లు భయంతో పరుగులు తీస్తున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది నేరగాళ్లు.. వేలాది మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని నడ్డి విరుస్తున్నారు పోలీసులు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఈ సెర్చ్ పుణ్యమా అని క్షణాల్లో పరిష్కారమైపోతున్నాయి. స్నాచర్లు.. దోపిడీ దొంగలు కార్డన్ సెర్చ్ లో పట్టుబడితే .. హత్య చేయాలని వేసిన పథకాలు సైతం బెడిసికొట్టాయంటున్నారు పోలీసులు.

వారానికో ప్రాంతంలో....

నిజానికి పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో చొరబడ్డ మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించేవారు. వారికంటే డేంజరస్ గా మారిన క్రిమినల్స్ ఆటకట్టించాలని సిటీలో కార్డాన్ సర్చ్ ను మొదలు పెట్టారు. స్టార్ చేసిన కొద్ది రోజుల్లోనే అనేక మంది పట్టుబడటం.. ఏళ్ల తరబడి పేరుకు పోయిన కేసులు పరిష్కారం కావడంతో దీన్ని సైబరాబాద్, రాచకొండ పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు. వారానికో ఏరియాను ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా పూర్తిగా తెలుసుకుంటారు. అనంతరం ఏరియా మొత్తం ఖాకీ దిగ్భందనం చేసి సోదాలు చేస్తారు.

యాభై మంది నేరగాళ్లు....

అలా పోటీ పడి చేసిన ఈ సెర్చ్ మూడు కమీషనరేట్ల పోలీసులకు బాగా కలిసి వచ్చింది. బాండెడ్ లేబర్ విధానం. నకిలీచాక్లెట్ల తయారీ. స్ట్రీట్ ఫైట్, అర్థరాత్రి అల్లరి మూకలు తెగ పట్టుబడిపోయారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అరెస్టు వారెంట్లకు కూడా విముక్తి కలుగుతోంది. నేరం చేసి తప్పించుకునే నేరస్తులు సడన్ తనిఖీలతో ఇట్టే పట్టుబడి పోతున్నారు. తాజాగా పాతబస్తీలో చేసిన కార్డాన్ సెర్చ్ లో 50 మంది నేరస్తులు దొరికితే, వీరిలో హత్య చేసి పరారీలో ఉన్న ఓ ముఠా కూడా చిక్కింది.

ఇక వారానికి రెండుసార్లు....

ఇక వారానికో సారి కాకుండా… వారానికి రెండుసార్లు నిర్వహించాలని సంకల్పించారు. సిటీ మొత్తం పీస్ అండ్ సెక్యూర్ గా ఉండాలంటే సమగ్ర నేరస్తుల సర్వే కాకుండా నాఖా బందీ.. కార్డాన్ సెర్చ్ లాంటి కార్యక్రమాలే ఉపయోగపడుతాయని పోలీస్ బాసులు భావిస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తేనే నేరస్తులు పట్టుబడటం లేదా పారిపోవడం జరుగుతుందని భావిస్తున్నారు.

Similar News