ఆ పాపను బలి ఇచ్చిందెవరంటే...??

Update: 2018-02-02 13:46 GMT

ఉప్పల్ చిలుకానగర్ లో బలైన మూడునెలల చిన్నారి కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు చిక్కుముడి విప్పేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. క్షుద్రపూజల కోసమే పాపను బలిచ్చినట్లు ఓ నిర్థారణకు వచ్చిన పోలీసులు.. మిగతా సగం శరీర భాగం కోసం గాలింపు ముమ్మరం చేశారు.

చంద్రగ్రహణంరోజు బలి...

హైరాబాద్ శివారు ప్రాంతంలోని చిలుకానగర్ లో కలకలం రేపిన మూడునెలల చిన్నారి బలి కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈకేసులో డాగ్ స్క్వాడ్ ద్వారా విషయం పసిగట్టిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చంద్రగ్రహణం రోజున ఇంట్లో అరిష్టాలు పోవడానికే చిన్నారిని బలిచ్చినట్లు ఓ నిర్థారణకు వచ్చారు పోలీసులు. అయితే పాప వివరాలు తెలుసుకునేందుకు మిగతా శరీరభాగం ఎక్కడ ఉంది అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన రోజున స్పాట్ కు వచ్చిన డాగ్ స్క్వాడ్ కారు డ్రైవర్ రాజశేఖర్ ఇంటి పక్కనే ఉన్న నరహరి ఇంట్లోకి వెళ్లి అక్కడ పూజ గది వద్ద కొంత సేపు కూర్చున్నాయి. అనంతరం నరహరి అతని కుమారుడు రంజిత్ చుట్టూ తిరిగిన డాగ్ స్క్వాడ్ అక్కడి నుండి బస్టాండ్ వరకు వెళ్లి తిరిగి వచ్చాయి. మళ్లీ నరహరి ఇంట్లోకి వెళ్లి బయటకు రావడంతో పోలీసులకు తండ్రీ కొడుకుల మీదనే అనుమానం వచ్చింది. అంతే కాకుండా ఇంట్లో పూజ చేసినట్లు కూడా కొన్ని ఆధారాలు పోలీసులకు లభించడంతో ఈ బలి విషయంలో నరహరి, రంజిత్ కి హస్తం ఉండవచ్చని అనుమానించారు. దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇంతకీ బాలిక ఎవరు?

ఇక బలైన మూడునెలల చిన్నారి ఎవరు అనేదే మిస్టరీగా మారింది. ఆమె తల్లిదండ్రులు ఎవరు.. ఎక్కడి నుండి తీసుకు వచ్చారు. ఎవరైన చిన్నారిని విక్రయించారా.. లేక కిడ్నాప్ చేసి తీసుకు వచ్చారా.. తల వేరు చేసి రాజశేఖర్ ఇంటిపై పడేసిన దుండగులు మిగతా శరీర భాగాన్ని ఎక్కడ దాచి పెట్టారన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటన స్థలంలో దొరికిన సిసి ఫుటేజ్ ని సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. దీన్ని మరింత డెవలప్ మెంట్ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. అయితే ఈ కేసులో హత్య చేసింది తండ్రీ కొడుకులే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సిటీలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లతో పాటు, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో ఉన్న మిగతా పోలీసులను సైతం ఉప్పల్ పోలీసులు సంప్రదిస్తున్నారు. ఏదైనా చిన్నారి మిస్సింగ్ కేసు నమోదై ఉందా అని వివరాలు తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరలో ఈ కేసు చిక్కుముడి విప్పాలని రాచకొండ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తును మరింత స్పీడ్ పెంచారు. చంద్రగ్రహణం రోజునే క్షుద్రపూజల కోసం మూడు నెలల పాపను బలిచ్చినట్లు ఓ క్లారిటీకి వచ్చారు.

Similar News