అమ్మ సేఫ్ : తమిళనాట ఆనందోత్సాహాలు!

Update: 2016-10-14 13:20 GMT

చాలా రోజుల తర్వాత అపోలో వైద్యులు జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే భాషలో శుక్రవారం నాడు కొన్ని వివరాలు వెల్లడించారు. జయలలిత కళ్లు తెరచి చూశారని ఆరోగ్యం కుదుటపడుతున్నదని డాక్టర్లు చెప్పారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన తర్వాత.. పరిస్థితి తీవ్రం అయినప్పటినుంచి..‘జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారు’ అనే మాట తప్ప అపోలో వైద్యులు మరో సంగతి చెప్పడం లేదు. ఇలాంటి మాటలతో ఆమె అభిమానుల్లో ఆందోళన పెరిగిపోవడం సహజంగా జరుగుతూ వచ్చింది. అయితే శుక్రవారం తొలిసారిగా ఆమె కళ్లు తెరచి చూశారని డాక్టర్లు ధ్రువీకరించారని వార్తలు వచ్చాయి.

నిజానికి శుక్రవారం ఉదయానికే కొన్ని పత్రికలు ఇ లాంటి వార్తలు అందించాయి. జయలలిత కళ్లు తెరచి చూశారని, వార్తా పత్రికలు తన ముందుకు తీసుకురావాల్సిందిగా కళ్లతోనే సైగ చేశారని, అయితే డాక్టర్లు వద్దని వారించారని, వెంటిలేటర్ కూడా తొలగించారని, మరికొన్ని రోజుల్లో ఆమెను మరో గదిలోకి మారుస్తారని ఇలాంటి వివరాలు విశ్వసనీయంగా తెలిసినట్లుగా కొన్ని పత్రికలు ప్రచురించాయి. అయితే ఈ వివరాలన్నీ కాకపోయినా.. కళ్లు తెరచి చూడడం వరకు నిజం అన్నట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు.

అమ్మ పురట్చితలైవి ఆరోగ్యం నిరపాయకరంగా ఉన్నదని డాక్టర్లు చెప్పడంతో తమిళనాట అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అపోలో ఆస్పత్రి ముందు గురువారం అభిమానులు యజ్ఞం కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి ముందు గుమికూడిన అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న అనేక మంది.. హర్షాతిరేకాల్లో మునిగిపోయారు.

కాగా, శుక్రవారం నాడు జయలలితను తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, విపక్షనేత కరుణానిధి సతీమణి తదితర ప్రముఖులు పరామర్శించారు.

Similar News