అమరావతిలో అసెంబ్లీ 27న ప్రారంభం

Update: 2017-02-25 15:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కేంద్రంగా పాలనా యంత్రాంగం పూర్తి స్థాయిలో కొలువు దీరనుంది. అమరావతి కేంద్రంగా శాసనసభా వ్యవహారాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. . ఆంధ్రప్రదేశ్‌ చట్టసభల భవనం అమరావతి వేదికగా పాలన అందించేందుకు సిద్ధమైంది. గత వర్షాకాల సమావేశాల వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే విధులు నిర్వర్తించిన సిబ్బంది ఈ నెల 27నుంచి అమరావతి అసెంబ్లీ భవనం వేదికగా శాసనసభ బాధ్యతలు కొనసాగించనున్నారు. దీంతో ఇకపై సభా వ్యవహారాలన్నీ పూర్తిగా అమరావతి నుంచే కొనసాగనున్నాయి.

మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు....

గత వారమే హైదరబాద్‌లో పనిచేసే ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేయగా సోమవారం నుంచి ఉద్యోగులంతా విధులు చేపట్టనున్నారు. కొత్త అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 11.30గంటలకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ సిబ్బంది ఈ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఉద్యోగుల తరలింపుతో దాదాపుగా ఏపీకి సంబంధించిన మొత్తం శాఖలన్నీ అమరావతికి వచ్చినట్లే.

Similar News