సినిమా ఒక్కటే... పాత్రలు మారాయి

Update: 2018-12-24 12:04 GMT

చంద్రబాబు నాయుడు బీజేపీతో సంసారం చేసినన్ని రోజులూ కాంగ్రెస్ ను తిట్టిన మాటలే ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తూ బీజేపీని తిడుతున్నారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును తీసిన సినిమా ఒక్కటేనని, కాకపోతే అప్పుడు కాంగ్రెస్ విలన్ అని, ఇప్పుడు బీజేపీ విలన్ అని ఎద్దేవా చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... 2014 ఎన్నికల్లో జగన్ కి ఓటేస్తే రాహుల్ గాంధీకి వేసినట్లేనని చెప్పిన చంద్రబాబు, ఇవాళ జగన్ కి ఓటేస్తే నరేంద్ర మోదీకి ఓటేసినట్లేని అంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయాల నుంచి....

20 మంది ఎంపీలతో, ఇద్దరు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి ఏమీ సాధించలేని చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్నారు. అమరావతి నిర్మాణం కేవలం గ్రాఫిక్స్ కు మాత్రమే పరిమితమైందని, బాహుబలి సినిమాలో సెట్టింగులతో మన అమరావతిని సమానం చేశారని పేర్కొన్నారు. కేవలం ఒక్క గేటు కట్టి పోలవరం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు సినిమా చూపిస్తున్నారు. చంద్రబాబు తానా అంటే యెల్లో మీడియా తందానా అంటూ చంద్రబాబు కీర్తిస్తుందని ఆరోపించారు. ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో కొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీశారన్నారు. అభివృద్ధి అంటే ప్రజల ఇంట్లోనో, ఊరిలోనో, పొలంలోనో, చదువుల్లోనో కనిపించాలని కానీ తెల్ల కాగితాల్లో కనిపించేది అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Similar News