ఎట్టకేలకు నెరవేరిన వైసీపీ నేతల పంతం

Update: 2018-11-23 06:44 GMT

జమ్మలమడుగు నియోజకవర్గంలోని గొరిగెనూరులో అడుగుపెట్టాలని కడప జిల్లా వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డికి పట్టున్న గొరిగెనూరు గ్రామంలో కొందరు గ్రామ స్థాయి నాయకులు వైసీపీలోకి చేరాలనుకున్నారు. కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇంఛార్జ్ సుధీర్ రెడ్డి గ్రామానికి వెళ్లి వీరిని పార్టీలో చేర్చుకోవాలని అనుకున్నారు. అయితే, ఆదినారాయణరెడ్డికి పట్టున్న ఈ గ్రామంలోకి వైసీపీ నేతలు వెళితే గొడవలు జరిగి శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు భావించారు. దీంతో వైసీపీ నేతలను గ్రామంలోకి వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు.

హైకోర్టుకు వెళ్లి మరీ...

ఎట్టి పరిస్థితుల్లో గొరిగెనూరులోకి అడుగుపెట్టి వైసీపీ జెండా ఎగరేయాలనుకున్న వైసీపీ నేతలు ఏకంగా హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. దీంతో ఒక గ్రామానికి వెళ్లకుండా వ్యక్తులపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య దేశంలో సరికాదని కోర్టు స్పష్టం చేసింది. వారిని గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ అవినాష్ రెడ్డి సహా వైసీపీ నేతలు గొరిగెనూరు గ్రామంలోకి వెళ్లి పలు కుటుంబాలను వైసీపీలో చేర్చుకున్నారు. గ్రామంలో తమ పార్టీ వారికి ఎటువంటి ఆపద తలపెట్టినా మంత్రి ఆదినారాయణరెడ్డే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తానికి ఒక గ్రామస్థాయి చేరికల కోసం వైసీపీ పట్టు పట్టి మరీ హైకోర్టుకు వెళ్లి సాధించి మంత్రికి షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

Similar News