ఆ నలుగురి మోసమే కారణం...

Update: 2018-12-08 12:01 GMT

గత ఎన్నికల సమయంలో మోసం చేసిన వారిని ప్రజలు నమ్మొద్దని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ కోరారు. శనివారం శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల జంక్షన్ లో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని బీజేపీ మాటిచ్చిందని, 15 ఏళ్లు తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారని, వీరిద్దరికీ పూచీగా పవన్ కళ్యాణ్ ఓట్లేయించారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా వీరు ముగ్గురూ రాష్ట్రాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఇక, ప్రత్యేక హోదా హామీని విభజన చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందన్నారు. మనల్ని మోసం చేసిన ఈ నాలుగు పార్టీలు రేపు ఓట్ల కోసం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా హైదరాబాద్ లా మారుతుందని, పెట్టుబడులు వచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఆలయానికి వెళ్లినప్పుడు నిండు మనస్సుతో టెంకాయ కొట్టి వేడుకోవాలని కోరారు. వైసీపీకి 25కి 25 ఎంపీ స్థానాలు వస్తే ప్రధానమంత్రిని మనమే నిర్ణయిస్తామని, ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయాలు

తాము అధికారంలోకి వస్తే ఈ గ్రామాల్లో లంచాల వ్యవస్థను పూర్తిగా మార్చేస్తామని, ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని జగన్ పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన యువకులకు అందులో ఉద్యోగాలు ఇచ్చి గ్రామంలోని సమస్యలను గ్రామంలోనే పరిష్కరిస్తామన్నారు. ఎవరికీ లంచాలు ఇవ్వకుండా కేవలం 72 గంటల్లో సామాన్యుల సమస్యలు పరిష్కరించే వ్యవస్థను నిర్మిస్తామన్నారు. దీని ద్వారా గ్రామ సచివాలయాల్లో లక్ష యాభై వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తామన్నారు. స్థానికంగా ప్రైవేటు సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేస్తామన్నారు.

Similar News