చంద్రబాబు ఏం చేస్తారో...?

Update: 2018-05-22 07:26 GMT

తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మధ్య రోజురోజుకు తీవ్రమవుతున్న వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. టీటీడీపై రమణ దీక్షతులు ఆరోపణలు చేయడం, వెంటనే ఆయనను రిటైర్మెంట్ పేరుతో విధుల నుంచి తొలగించడంతో రమణ దీక్షితులు టీటీడీపై, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఆలయంలో పోటు(వంటశాల)లో తవ్వకాలు జరిపారని, స్వామివారిని 22 రోజులు పస్తులుంచారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామివారికి చెందిన ఓ గులాబీ రంగు వజ్రం పోయిందని రికార్డుల్లో రాశారని, కానీ అటువంటి వజ్రమే జెనీవాలో ఈ మధ్య వేలం వేశారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు ఆమరణ దీక్షకు కూడా దిగుతానంటున్నారు.

హుటాహుటిన అమరావతికి...

రమణ దీక్షితులు ఆరోపణలతో రోజురోజుకూ ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. టీటీడీ, ప్రస్తుత అర్చకులు సైతం ఆయనపై ఆరోపణలు చేశారు. రమణ దీక్షితులుకి మద్దతుగా బ్రాహ్మణ సంఘాలు, పలు పార్టీలు మాట్లాడుతున్నాయి. పైగా సీబీఐ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని రమణ దీక్షితులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రజల్లో ఈ వివాదం చర్చనీయాంశమైంది. దీంతో ఈ అంశంపై మాట్లాడేందుకు చంద్రబాబునాయుడు టీటీడీ అధికారులను పిలిచారు. దీంతో ఆయన ఈఓ, ఛైర్మన్ వెంటనే అమరావతికి వచ్చారు. అయితే, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన ఈ వివాదానికి చంద్రబాబు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.

Similar News