తిరుమల విషయంలో టీటీడీ దిగివచ్చినట్లేనా...?

Update: 2018-07-17 06:24 GMT

తిరుమల ఆలయ మహాసంప్రోక్షణ కోసం శ్రీవారి ఆలయం మూసివేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వం, టీటీడీ వెనక్కి తగ్గినట్లు కనపడుతోంది. ఆలయాన్ని ఎనిమిది రోజుల పాటు మూసి వేస్తున్నారనే ప్రచారం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందించారు. ఈ నిర్ణయంపై మరోసారి సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలని, భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించేలా ప్రయత్నించాలని టీటీడీ అధికారులకు సూచించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆగమశాస్త్రం ప్రకారం, గతంలో చేసిన విధంగా మహాసంప్రోక్షణ జరపాలని సూచించారు.

వ్యతిరేకత కారణంగానే...

దీంతో టీటీడీ సైతం తన నిర్ణయంపై పునరాలోచనలు చేస్తోంది. మహాసంప్రోక్షణ జరిగే ఆగస్తు 9 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు పరిమిత సంఖ్యలో, రోజుకు కొంత సమయమైనా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఆలయాన్ని ఎనిమిది రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని ఇంతకుముందు టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు, భక్తులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు కనపడుతోంది.

Similar News