సూపర్ 30..అంతా ఉత్తదేనా..?

Update: 2018-07-25 09:22 GMT

సూపర్ 30... పేద విద్యార్థులను ఐఐటీయన్లు మార్చే ఓ బృహత్ కార్యక్రమంగా దేశవ్యాప్తంగా పేరుగాంచింది. రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథ్స్ కింద 30 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ఎంపిక చేసి ‘సూపర్ 30’ పేరుతో ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఐఐటీ ప్రవేశానికి శిక్షణ ఇస్తారు. ప్రతీ యేటా కేవలం 30 మందికి మాత్రమే ఈ శిక్షణ ఉంటుంది. ఈ 30 మందిలో ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీకి ఎంపికవుతారనే పేరుతో ఆనంద్ కుమార్ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠను దక్కించుకున్నారు. అయితే, ఈ సూపర్ 30 అంతా ఫేక్ అని అందులో చదివిన పూర్వ విద్యార్థులు కొందరు ఆరోపిస్తున్నారు.

డబ్బులు వసూలు చేస్తున్నారు...

సూపర్ 30లో ఈ యేడాది 26 మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశం పొందారని ఆనంద్ ప్రకటించారు. అయితే, ఆయన ప్రకటన అబద్ధమని, 30 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఆనంద్ పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇతర సంస్థల్లో చదివిన విద్యార్థులను కూడా ఆనంద్ తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక పేద విద్యార్థులకు ఉచితంగా ఆయన శిక్షణ ఇవ్వడం లేదని, సూపర్ 30కి ఎంపికకు ముందు రామానుజన్ సంస్థలో కోచింగ్ తీసుకుని వారి పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందు గాను రామానుజన్ సంస్థకు కోచింగ్ ఫీజ్ కింద రూ.33,040 కట్టాల్సి ఉంటుందంటున్నారు. ఇలా ఆనంద్ కుమార్ సుమారు రూ.ఒక కోటి వరకు వసూలు చేశారని అంటున్నారు. అయితే, సూపర్ 30 పేరుతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన ఆనంద్ ఇలా ఆరోపణలు ఎదుర్కోవడం ఆసక్తికరమే.

Similar News