టాలివుడ్ కు షాకింగ్ న్యూస్

Update: 2018-07-29 02:00 GMT

తెలుగు చిత్రపరిశ్రమ మరోసారి షాక్ కి గురైంది. కమెడియన్ విజయ్ ఆత్మహత్య నుండి ఇంకా తేరుకోముందే నటీ అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య కలకలం రేగింది. అనారోగ్య కారణాలు.. ఒక్కగానొక్క కూతురికి మాటలు రాక పోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కూతురి మరణవార్త తెలియగానే షాక్ కి గురైన అన్నపూర్ణ.. గుండెలు పగిలేలా రోదిస్తోంది. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యక స్థానం సంపాదించుకున్న నటి అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య షాక్ కి గురి చేసింది. ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుందని తెలియడంతో అన్నపూర్ణ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఒక్కొగానొక్క కూతురు.....

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో గల గోదావరి అపార్టుమెంట్ లో 104లో నటి అన్నపూర్ణ ఉంటోంది. బెంగుళూరులోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాయి అనే వ్యక్తికి తన కూతురు కీర్తిని ఇచ్చి అయిదు సంవత్సరాల కిందట వివాహం చేసింది. ఈ దంపతులకు ఓ పాప ఉంది. భర్త సాయి బెంగుళూరులో ఉండటంతో తన కూతురు, అత్తతో కలిసి కీర్తీ తన తల్లి పక్కన ఫ్లాట్ 102లో నివాసం ఉంటోంది. ఒక్కగానొక్క కూతురికి మాటలు రాక పోవడంతో కీర్తీ డిప్రెషన్ కి గురైంది. ఈ విషయమై కుటుంబ సభ్యులు, అత్తింటి వారు కూడా ఎంతో నచ్చచెప్పారు. చిన్నారిని తీసుకొని పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకు వెళ్లిన ఫలితం కనపడకపోవడంతో కీర్తీ తీవ్ర మానసిక వేదన అనుభవించింది.

ఆరోగ్య కారణాలు.....

దీనికి తోడు ఆమె ఆరోగ్యం కూడా గత ఆరునెలలుగా సరిగా ఉండకపోవడంతో తట్టుకోలేక ఉదయం తన బెడ్ రూమ్ లోని సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే లేచే కీర్తీ 9గంటలయినా బయటకు రాక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తట్టినా తీయక పోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఫ్యానుకు వేలాడుతూ కనిపించిన కీర్తి డెడ్ బాడీని చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీ తరలించారు. గదిలో సుసైడ్ నోట్ ఏమైనా ఉందా అన్న కోణంలో తనిఖీ చేశారు. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అనారోగ్య కారణాలు, కూతురికి మాటాలు రాక పోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కీర్తీ ఆత్మహత్యతో గోదావరి అపార్టుమెంట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News