కిడ్నాప్ కేసులో షాకింగ్ నిజాలు… పక్కా స్కెచ్ తోనే?

అఖిలప్రియ కేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి.. స్పెషల్ చబ్బీస్ మూవీ చూసి ప్రవీణ్ రావు సోదరులను ఎలా కిడ్నాప్ చేయాలన్న దానిపై అఖిల్ ప్రియ గ్యాంగ్‌కు ఆమె [more]

Update: 2021-01-14 02:52 GMT

అఖిలప్రియ కేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి.. స్పెషల్ చబ్బీస్ మూవీ చూసి ప్రవీణ్ రావు సోదరులను ఎలా కిడ్నాప్ చేయాలన్న దానిపై అఖిల్ ప్రియ గ్యాంగ్‌కు ఆమె భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చారు. స్పెషల్ చబ్బీస్ సినిమా సీన్లను చూపించి.. కిడ్నాప్ ఎలా చేయాలి? ఐటీ అధికారులుగా ఎలా నటించాలి? వారిని ఎలా నమ్మించాలి? అని రిహార్సల్స్ కూడా చేశారు.

పక్కా ప్లాన్ ప్రకారమే….?

బోయిన్ పల్లి ప్రవీణ్ రావ్ సోదరుల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. నగరం నడిబొడ్డున కిడ్నాప్ జరగడం.. దీని వెనక ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ హస్తం ఉండడంతో అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆమె విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం సినిమా తరహాలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రియ గ్యాంగ్ స్కెచ్ వేసినట్లు తేలింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ చబ్బీస్’ చిత్రంలో సీన్లను చూసి.. ఇక్కడ అమలు చేశారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించారు. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు.

సినిమా కంపెనీ నుంచి…..

కిడ్నాప్‌కు సంబంధించి యూసుఫ్‌గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్ క్లాస్‌ కూడా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడే స్పెషల్ చబ్బీస్ మూవీ సీన్లను తమ గ్యాంగ్ సభ్యులకు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రహాస్ చూపించారు. ఐటీ అధికారుల్లా కనిపించేందుకు.. కాస్ట్యూమ్స్, ఐడీ కార్డులు సిద్ధం చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఓ సినిమా కంపెనీ నుంచి ఐటీ అధికారుల డ్రెస్సులను అద్దెకు తీసుకున్నాడు. అంతా ఓకే అనుకున్నాకే.. ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అంతలోనే అడ్డంగా దొరికిపోయారు.

భార్గవ్ జాడ విషయంలో…..

మరోవైపు ఈ కేసులో ఏ 1 అఖిల ప్రియ విచారణ నిన్నటితో ముగిసింది. మంగళవారం దాదాపు 8 గంటల పాటు ఆమెను పోలీసులు ప్రశ్నించారు. పలు విషయాల గురించి సమాధానాలు రాబట్టారు. ఐతే మరికొన్నింటికి మాత్రం ఆమె నోరు విప్పడం లేదని తెలిసింది. కిడ్నాపర్లతో మాట్లాడిన కాల్ డేటా‌తో పాటు సెల్‌టవర్ లొకేషన్‌లకు సంబంధించిన ఆధారాల గురించి ఆమె ప్రశ్నించారు. అయితే తనకు అంతగా గుర్తు లేదని దాటవేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. తన భర్త భార్గవ్ రామ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కానీ ఆమె మాత్రం నోరు విప్పడం లేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

అఖిలప్రియ సోదరుడి పాత్ర…..

ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అఖిల ప్రియతో పాటు మరో ముగ్గురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మరికొందరిని విజయవాడ, గోవాలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నారు. వీరిలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా ఉన్నారు. ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌లోని 48 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రవీణ్ రావు ఫ్యామిలీకి, అఖిల ప్రియ ఫ్యామిలీకి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రవీణ్ రావు సోదరులను అఖిల్ ప్రియ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.కాగా అఖిలప్రియను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Tags:    

Similar News