పేటీఎం.....సో పిటీ....!

Update: 2018-08-18 11:49 GMT

పేటీఎం.. ఇవాళ దేశంలో ప్రముఖ సంస్థ. ఏ గల్లీలో చూసినా, టీకొట్టులో చూసినా పేటీఎం ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రజలు సైతం పేటీఎం ద్వారా చెల్లింపులకు అలవాటు పడ్డారు. దీంతో ఆ సంస్థ భారీ లాభాల్లో ఉంది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ దేశంలోనే అతిపిన్న వయస్కుడైన బిలయనీర్ గా మారిపోయాడు. వందల కోట్లు సంపాదించాడు. అయితే, ఆదాయం పెద్దదైనా ఆయన మనస్సు చిన్నదిగా ఉంది. అందుకే కేరళ వాసులకు వరదసహాయంగా ఆయన కేవలం రూ.10 వేలు మాత్రమే చేశాడు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ఆయన చెప్పారు. ఇందుకు రుజువుగా రసీదుగా వచ్చిన మెసేజ్ ను కూడా జత చేశాడు. మీరు కూడా పేటీఎం ద్వారా కేరళవాసులకు సహాయం చేయండి అని కోరాడు.

ఇదే మొదటసారి కాదు...

అయితే, ఇంత డబ్బు అర్జిస్తున్న పేటీఎం సంస్థ వ్యవస్థాపకుడు కేవలం పది వేలు సహాయం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రూ.12 వేల కోట్ల అధిపేతి అయిన విజయ్ శేఖర్ అంత తక్కువ మొత్తం సహాయం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఆయన భారత ఆర్మీకి రూ.500 విరాళం ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అలానే ట్రోలింగ్ కు గురవుతున్నారు. అయితే, వెంటనే తేరుకున్న విజయ్ శేఖర్ సదరు ట్వీట్ ను డిలీట్ చేశారు. పేటీఎం ప్రజల ద్వారా రూ. 3 కోట్ల విరాళాలు సేకరించింది. ఈ మొత్తాన్ని కేరళకు అందించనుంది.

Similar News