నారా వారింటికి... దారేదీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై స్పందించారు. కొన్ని పార్టీలు తమతో పొత్తు కోరుకోవచ్చని, అందులో తప్పేమీ లేదన్నారు.

Update: 2022-01-12 06:52 GMT

పవన్ మాటలకు అర్థాలు ఏంటి? టీడీపీతో పొత్తు ఉంటుందా? ఉండదా? బీజేపీతోనే కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ పొత్తులపై స్పందించారు. కొన్ని పార్టీలు తమతో పొత్తు కోరుకోవచ్చని, అందులో తప్పేమీ లేదన్నారు. అంతవరకూ బాగానే ఉంది. అందరితో కలసి చర్చించిన తర్వాతనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ తెలిపారు.

అర్థాలు వెతుక్కుంటూ....
పవన్ కల్యాణ్ అన్న ఆ మాటకు అన్ని పార్టీలూ అర్థాలు వెతుక్కుంటున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఏది కోరుకుంటే అదే జరుగుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ టీడీపీ, జనసేన క్యాడర్ రెండు పార్టీలు కలసి పోటీ చేయాలనే కోరుకుంటుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ విషయం స్పష్టమైంది. కొన్ని చోట్ల జనసేనకు టీడీపీ అభ్యర్థికి సపోర్టు చేయగా, మరికొన్ని చోట్ల టీడీపీ జనసేనకు మద్దతిచ్చింది. ఈ విషయం పవన్ కు తెలియంది కాదు.
ఇప్పటికే క్యాడర్ లో...
టీడీపీ, జనసేన కాంబినేషన్ లో స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లను గెలుచుకున్నాయి కూడా. అందుకే పవన్ కల్యాణ్ క్యాడర్ కోరుకున్న విధంగానే జరుగుతుందని చెప్పారు. అయితే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీతో పొత్తుకు పవన్ దిగారు. ఆ సమయంలో ఎవరినీ సంప్రదించలేదు. బీజేపీతో పొత్తును జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో వ్యతిరేకించింది. మతతత్వ పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నించింది. క్యాడర్ నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే పవన్ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారన్న విషయాన్ని కొందరు గుర్తు చేశారు.
బీజేపీని కంట్రోల్ చేయడానికేనా?
ఇప్పుడు కూడా క్యాడర్ అని ఒక మాట చెప్పారు తప్పించి, మానసికంగా పవన్ పొత్తుకు సిద్ధమయ్యారని అంటున్నారు. క్యాడర్ సూచించిన మేరకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ బీజేపీపై కూడా వత్తిడి తెచ్చే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు కొంత బెట్టుగా ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫలాలు కూడా పొందచ్చని, అందుకే పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. టీడీపీతో పొత్తు ఉంటుంది కాని, ఈసారి షరతులు ఎక్కువగానే ఉంటాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News