మరో మూడు గంటలే...వింటారంటారా...??

Update: 2018-11-22 06:43 GMT

నామినేషన్ల ఉపసంహరణకు గడువు మరి కొన్ని గంటలే ఉండటంతో అన్ని పార్టీలూ రెబెల్స్ ను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి రెబెల్స్ గా వేసిన కొత్త మనోహర్ రెడ్డి(మహేశ్వరం), రాజారపు ప్రతాప్(స్టేషన్ ఘన్ పూర్), శశిధర్ రెడ్డి(కోదాడ), ఎర్రబెల్లి ప్రదీప్ రావు(వరంగల్ ఈస్ట్), గండ్ర సత్యనారాయణరావు(భూపాలపల్లి) వంటి వారు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతీసే అవకాశం ఉండటంతో కేటీఆర్ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. అయితే, రాజారపు ప్రతాప్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గండ్ర సత్యానారయణరావు మాత్రం నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అంటున్నారు. కచ్చితంగా పోటీ చేస్తామని భీష్మించుకు కూర్చున్నారు.

రంగంలోకి దిగిన ముఖ్యనేతలు

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపులపర్వం నిన్నటి నుంచీ ముమ్మరంగా చేస్తున్నారు. రాష్ట్ర నేతలతో పాటు ఏఐసీసీ ముఖ్యనేతలు అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, పుదుచ్చెరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ తదితరులు హైదరాబాద్ లో దిగిపోయారు. రెబల్స్ గా నామినేషన్లు వేసిన విజయరామారావు(స్టేషన్ ఘన్ పూర్), వెంకటస్వామి(చేవెళ్ల), నారాయణరావు(తాండూరు), చంద్రశేఖర్(వికారాబాద్), క్రిశాంక్(కంటోన్మెంట్), బండ కార్తీకరెడ్డి(సికింద్రాబాద్), బిక్షపతి యాదవ్(శేరిలింగంపల్లి), నాయిని రాజేందర్ రెడ్డి(వరంగల్ పశ్చిమ), రాజనాల శ్రీహరి(వరంగల్ తూర్పు), పటేల్ రమేష్ రెడ్డి(సూర్యాపేట), నారాయణరావు పటేల్(ముదోల్), సంజీవరెడ్డి(నారాయణఖేడ్), మల్ రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం), శివకుమార్ రెడ్డి(నారాయణపేట), హరినాయక్(ఖానాపూర్), రోహిన్ రెడ్డి(ఖైరతాబాద్), ఊకె అబ్బయ్య(ఇల్లందు), కార్తీక్ రెడ్డి(రాజేంద్రనగర్), కొమిరెడ్డి రాములు(కోరుట్ల), శశికళా యాదవ్ రెడ్డి, అంజిరెడ్డి(పటాన్ చెరు), శశిధర్ రెడ్డి(మెదక్), రవీందర్(ధర్మపురి), నందికంటి శ్రీధర్(మల్కాజిగిరి), తోటకూర జంగయ్య యాదవ్(మేడ్చల్), ఇబ్రహీం(మహబూబ్ నగర్), సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి(ఉప్పల్) కాంగ్రెస్ రెబల్స్ గా నామినేషన్లు వేశారు. వీరిలో చాలామంది ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మిగతావారికి కూడా నచ్చజెప్పేందుకు నేతలు వారి ఇళ్లకు వెళ్లి భవిష్యత్ లో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Similar News