ఈ నెల తన జాతకం బాగాలేదని...?

Update: 2018-08-30 03:14 GMT

జాతకాలను, ముహూర్తాలను విపరీతంగా నమ్మే నందమూరి హరికృష్ణకు ఆహ్వానం హోటల్ అంటే ఎనలేని ఇష్టం. అబిడ్స్ లో ఉండే ఆహ్వానం హోటల్ లోనే ఒక రూమ్ ను హరికృష్ణ ఉంచుకునే వారు. మిగిలినదంతా లీజుకిచ్చినా 1006 రూమ్ నెంబరు గదిని తన వద్దనే ఉంచుకున్నారు. నిత్యం ఆ గదికి వచ్చే హరికృష్ణ తన స్నేహితులతో గడిపేవారు. నెల్లూరు బయలుదేరే ముందు రోజు కూడా హరికృష్ణ ఆహ్వానం హోటల్ కు వచ్చినట్లు ఆయన స్నేహితులు చెబుతున్నారు. తనకు ఈ నెల బాగాలేదని పండితులు చెప్పారని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సన్నిహితులతో అన్నారట. రేపు ఉదయం నెల్లూరు వివాహానికి బయలుదేరి వెళ్లాలని, వస్తానో రానో అని అన్న హరికృష్ణ మాటలు విని వారు కుమిలిపోతున్నారు.

డ్రైవర్ వస్తే వెనక్కు పంపి.......

హరికృష్ణ ఇటీవల డ్రైవర్ పెట్టుకుందామని నమ్మకమైన వ్యక్తి కోసం సన్నిహితులను కూడా ఆరా తీశారు. టీడీపీ నేత అమర్ నాధ్ బాబుకు తనకొక మంచి డ్రైవర్ కావాలనికోరగా, ఆయన ఒక వ్యక్తి పంపారు. అయితే ఆ యువకుడు జాతకాన్ని పరిశీలించిన హరికృష్ణ సరిగా లేదని పంపించివేశారని చెబుతున్నారు. ఆ వ్యక్తి డ్రైవర్ గా చేరి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. హరికృష్ణ భౌతిక కాయానికి ఈ రోజు సాయంత్రం 4గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మెహదీపట్నంలో ఆయన ఇంటి నుంచి అంతిమయాత్ర మధ్యాహ్నం 2.30గంటలకు బయలుదేరనుంది. దీంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

Similar News