జగన్ పై దాడిపై జేడీ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-11-26 10:15 GMT

తాను ఇక నుంచి ప్రజా జీవితంలోనే ఉంటానని... ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. సోమవారం ఆయన జయప్రకాశ్ నారయణ సమక్షంలో లోక్ సత్తా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఎన్నికలకు వెళ్లడం అనేది తన విధివిధానాల్లో ఒకటని, తాము తయారుచేసిన పీపుల్స్ మ్యానిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు. తనతో కలిసి నడిచేందుకు ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా పార్టీల నేతలు అంగీకరించారని తెలిపారు. ప్రజలందరికీ విద్య, వైద్యం, వ్యవసాయంతో ఉపాధి కల్పన తన విధివిధానాల్లో ప్రముఖమైనవన్నారు.

రైతుల కన్నీళ్లు తూడుస్తా...

ఎన్నికల్లో పోటీచేస్తామని, ఒంటరిగానా, లేదంటే కలిసి పనిచేసే వాళ్లను కలుపుకొని వెళ్తామా అనేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. రైతులు దు:కిస్తున్నారని వారి కన్నీళ్లు తూడ్చడానికి ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పై దాడి ఏపీ ప్రభుత్వం వైఫల్యమేనన్న ఆయన రాష్ట్రంలో జరిగే ప్రతి నేరానికి రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు. పుష్కరాలు, నవనిర్మాణ దీక్షల కోసం ప్రభుత్వ ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Similar News