అర్థరాత్రి ఆనందబాష్పాలు నిజం కాదా..?

Update: 2018-07-24 11:50 GMT

రాష్ట్ర ప్రభుత్వం స్వార్థం, నిర్లక్ష్యం వల్లే ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు అమలు కాలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు విమర్శించారు. రాజ్యసభలో ఏపీ విభజన చట్టంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా పార్లమెంట్ చేసిన చట్టాన్ని తమ రాజకీయాల కోసం అమలు చేయకపోవడం చూస్తే దేశ భవిష్యత్తుపై భయం కలుగుతుందన్నారు. చట్టాలు చేసే వారే చట్టాలను అమలు చేయకపోతే పార్లమెంట్ పై ప్రజలకు పార్లమెంట్ పై విశ్వాసం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఏపీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కేవలం విభజన చట్టంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మాత్రమే అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే ఏపీకి న్యాయం చేస్తామని బీజేపీ చెప్పిన మాటలను నమ్మి వారిని, వారి మిత్రపక్షాలను ప్రజలు అధికారంలోకి తెచ్చారన్నారు. కానీ, అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాలను మరిచిపోయారని ఆరోపించారు.

అపాయింట్ మెంట్ల వల్లే బయటకు వచ్చారు

రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న పార్టీలు నాలుగేళ్లుగా హనీమూన్ చేసుకున్నాయన, రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుందని కేంద్రం... కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్యాకేజీలు చూసి పొంగిపోయి సన్మానాలు, అసెంబ్లీలో తీర్మనాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మురిసిపోయాయని ఎద్దేవా చేశారు. చెమర్చిన కళ్లతో అర్థరాత్రి ప్రెస్ మీట్లు పెట్టిమరీ ఆనందబాష్పాలు రాల్చారని గుర్తు చేశారు. ప్రతిపక్షానికి చెందిన వారికి(వైసీపీ) అపాయింట్ మెంట్లు ఇస్తున్నారనే టీడీపీ కేంద్రం నుంచి బయటకు వచ్చింది కానీ రాష్ట్ర కోసం కాదని ఆయన పేర్కొన్నారు. లోక్ సభలో ప్రధాని మోదీ చెప్పింది కూడా అదే అని వైసీపీ ఉచ్చులో టీడీపీ చిక్కుకుందని చెప్పారని గుర్తు చేశారు.

వారికి రాజకీయాలు మాత్రమే....

వీరికి పార్లమెంట్ లో చట్టం చేసింది, ప్రజలకు చెప్పిన వాటితో సంబంధం లేదని, కేవలం వారి రాజకీయాల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం పొత్తు పెట్టుకుని అధికారం అనుభవించి హామీలను పట్టించుకోకుండా ఇప్పుడు అన్యాయం జరిగిందని పుస్తకాలు పంచితే ఏమీ లాభమని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పంచుకుని ఎన్నికలు వస్తున్నాయని ఇలా చేయడం సరికాదన్నారు. విభజన హామీలు అమలు కాకపోవడంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉందన్నారు. తప్పు ఎవరిదైనా అన్యాయం జరిగింది మాత్రం ప్రజలకే అన్నారు. రానున్న ఎన్నికల్లో వీరికి ప్రజలు బుద్ది చెబుతారన్నారు.

Similar News