ఒక్కో రాష్ట్రం...ఒక్కో పేరు...ఈ మోస‌గాడి రూటే స‌ప‌రేటు

Update: 2018-07-19 14:25 GMT

విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని న్యూస్ పేపర్ లో ప్రకటన ఇస్తూ అమాయక ప్రజలని మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర మోసగాడు పంజాబ్ కి చెందిన తల్విoదర్ సింగ్ ని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని బ్యాంక్ అకౌంట్ మరియు ఇంట్లో నుండి 16 లక్షల 84 వేల‌ నగదు మరియు 4లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ లలో మోసాలకు పాల్పడినట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు.

ఉద్యోగం ఇస్తాన‌ని ఢిల్లీకి పిలిచి

పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ అంతర్ రాష్ట్ర మోసాగాని అసలు పేరు తల్వింధర్ సింగ్ కానీ ఒక్కో రాష్ట్రానికి వెళ్లి మోసం చేయలనుకున్నపుడు ఒక్కో నకిలీ పేరుతో మోసాలకు పాల్పడుతుంటాడు. ఆ పేరుకు తగ్గట్టుగా వేషధారణ కూడా మారుస్తుంటాడు. ముఖ్యంగా ఈ ఘరానా మోసగాడికి నిరుద్యోగులైన యువతులు మరియు మహిళలే టార్గెట్ గా చూసుకుంటాడు. ప్రధాన పత్రికలలో విదేశాల్లో ఉద్యోగాలు అంటూ, అత్యవసరంగా కావాలంటూ ప్రకటనలు ఇస్తాడు అది చూసి ఫోన్ చేసిన వారిని అతని పథకం ప్రకారం అన్ని డీటెయిల్స్ చెప్పి ఇంటర్వ్యూ కోసం పిలిపించి మోసం చేసి అక్కడనుండి జారుకుంటాడు. అదే తరహాలో ఎల్ బి నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఎన్ టి ఆర్ నగర్ లో నివాసముంటున్న గుర్రం హరిత ఒక రోజు ఒక ఆంగ్ల దినపత్రిక లో వచ్చిన ప్రకటన చూసి అందులో ఉన్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మాట్లాడగా విదేశీ పర్ఫ్యూమ్ ఫ్రాంచైజర్ లో ఉద్యోగం కల్పిస్తామని, మంచి జీతం ఉంటుందని నమ్మించి ఢిల్లీకి రావాలని తెలిపాడు.

కూల్‌డ్రింక్ లో మ‌త్తుమందు క‌లిపి...

అది నిజమే అని నమ్మిన బాధితురాలు తన తల్లి సుజాత తో కలిసి విమానం లో ఢిల్లీకి వెళ్లి నిందితునికి ఫోన్ చేసింది. అక్కడకి వచ్చిన నిందితుడు వారిని హోటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ ఆహారం తినిపించే సమయంలో పథ‌కం ప్రకారం శీతలపానియంలో మత్తు మాత్రలు వేసి తాగించగా బాధితులు కొంచం మత్తులోకి వెళ్ల‌గానే వారిని ట్రైన్ లో ఝాన్సీకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ఓం పాలెస్ హోటల్ లో ఉంచి వారి వద్ద ఉన్న ఏటిఎమ్ కార్డుల‌ను తీసుకుని ఏటిఎమ్ లలో 19 లక్షల రూపాయ‌లు తీసుకుని పక్కనే ఉన్న జ్యూవెల్లరీ షాప్ లో నగలు కూడా కొన్నాడు.

మింగింది క‌క్కించారు...

తాము మోసపోయామని తెలుసుకున్న మ‌హిళ‌లు అక్కడ స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించిగా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ కి చేరుకుని రాచకొండ సీపీని, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఝాన్సీకి వెళ్లి నిందితుడు పర్యటించిన ప్రాంతాల్లో నమోదైన సిసి కెమెరాలో నమోదు అయిన వీడియోలు సేకరించారు. అదే సమయంలో మహబూబ్ నగర్ కి చెందిన మరోకరిని కూడా మోసం చేసినట్లు తెలుసుకున్నారు. నిందితుడు రాజస్థాన్ లో కూడా ఇదే తరహాలో మరో ముగ్గురిని మోసం చేసి బికనెర్ లోని కేంద్ర కారాగారం లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి నిందితున్ని పిటి వారెంట్ పై హైదరాబాద్ కి తీసుకువ‌చ్చారు. నిందితున్ని అతని ఇంటికి తీసుకెళ్లి మోసం చేసి సంపాదించిన డబ్బుని మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Similar News