పోకిరి సినిమాను తలపించిన వ్యవహారం …?

పూరి జగన్నాధ్ తీసిన సంచలన చిత్రం పోకిరి అందరికి గుర్తు వుండే ఉంటుంది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి ఇన్ స్పెక్టర్ పాత్ర ఆ చిత్రానికే హైలెట్. [more]

Update: 2019-02-17 02:19 GMT

పూరి జగన్నాధ్ తీసిన సంచలన చిత్రం పోకిరి అందరికి గుర్తు వుండే ఉంటుంది. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి ఇన్ స్పెక్టర్ పాత్ర ఆ చిత్రానికే హైలెట్. పోలీస్ అధికారిగా వుంటూ గ్యాంగ్ స్టార్స్ తో కలిసి పోయి చిత్రం చివరి వరకు ఆయన నటించిన నటన అనన్య సామాన్యం అని ప్రేక్షక లోకం నీరాజనం పలికింది. ఇది సినిమాలో పాత్ర కానీ నిజ జీవితంలో కొందరు పోలీసులు ఇదే తీరులో వ్యవహరిస్తూ తమ ఖాకీ దుస్తులకే మరకలు అంటించుకోవడమే కాదు డిపార్ట్మెంట్ పరువును తెలుగు రాష్ట్రాల సాక్షిగా తీసిపారేసారు. ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

జయరాం కేసులో పడిన మూడో పోలీస్ వికెట్ …

పారిశ్రామికవేత్త,కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ జయరాం హత్యకేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. ఇప్పటికే ఎసిపి మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లపై పోలీస్ ఉన్నత అధికారుల వేటు పడింది. ఈ జాబితాలోకి రాయదుర్గం సిఐ రాంబాబు వచ్చి చేరారు. జయరాం హత్య అనంతరం వీరంతా నిందితుడు రాకేష్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చినట్లు విచారణలో తేలడంతో ఖాకీ బాస్ లు ఉలిక్కిపడి వీరిపై చర్యలకు ఉపక్రమించారు. హత్య కేసు ఏపీలో అయితే ఈజీగా మాఫీ చేయొచ్చని అక్కడి పోలీసులను మేనేజ్ ఎలా చేయాలో కూడా వీరిచ్చిన సలహాలతో రాకేష్ రెడ్డి ఏపీకి జయరాం శవాన్ని తరలించి కారులో పడవేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు.

తీగ లాగితే డొంక ….

తరువాత కేసు ఎపి పోలీసులు నమోదు చేయడం జయరాం భార్య వ్యక్తం చేసిన అనుమానాలతో తెలంగాణ పోలీసుల రంగప్రవేశం చకచకా జరిగిపోయాయి. హత్య హైదరాబాద్ లోనే జరగడంతో చట్ట ప్రకారం విచారణ కూడా తెలంగాణ పోలీసులే చేపట్టాలిసి వుంది. ఆ పద్దతిలోనే కేసు దర్యాప్తు టి ఖాకీలకు చేరడంతో తమదైన రీతిలో విచారణ చేస్తే కంచె చేను మేసిన ఈ ఉదంతం ఇప్పటికే జనంలో పరువు కోల్పోతున్న ఖాకీలకు మరింత అపఖ్యాతి మూటగట్టింది. దాంతో బాటు నేరస్థులు కొందరు పోలీసుల సాయంతో చేసే చట్ట విరుద్ధ కార్యక్రమాలు చర్చకు దారితీసి ఖాకీల విశ్వసనీయతనే దెబ్బతీశాయి.

Tags:    

Similar News