నారావారిపై జగన్ పంచ్ లు భలే పేలాయే...!

Update: 2018-05-30 12:54 GMT

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో జరుగుతన్న ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. బుధవారం సాయంత్రం నర్సాపురం స్టీమర్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... 2017 మహానాడులో ప్రత్యేక హోదాతో ప్రయోజనం ఉండదని చెప్పిన చంద్రబాబు నాయుడు బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసి విడాకులు తీసుకుని ఇప్పుడు ఈ మహానాడులో ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేశారని విమర్శించారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు 98 శాతం పూర్తిచేశానని చెబుతున్నాడని, కనీసం ఆయన మొదటి సంతకాలు పెట్టిన హామీలు కూడా నెరవేరలేదని విమర్శించారు.

బిరుదులు సార్ధకం చేసుకున్నారు...

వైఎస్ జగన్ ను తిట్టడానికే మహానాడు పెట్టుకున్నారన్నారు. ప్రపంచ అబద్ధాలు, మోసాల పోటీలు నిన్నటితో ముగిసాయని, వీటిలో చంద్రబాబు నెంబర్ వన్ గా నిలిచి ‘తుప్పు’ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారని మహానాడు ను ఎద్దేవా చేశారు. నారా లోకేష్ నంబర్ టూగా నిలిచి ‘పప్పు’ అనే పేరును నిలబెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని, ఎన్టీఆర్ నుంచి పార్టీని, జెండాను, ట్రస్ట్ ను లాక్కున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో అధికారంలోకి రామని తెలిసి బీసీలకు సీఎం పదవి ఇస్తామని మభ్య పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 12 మంత్రి పదవులు ఇస్తామని తీర్మానం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Similar News