ముంబయి విక్రమార్కుడు ఇక లేరు

Update: 2018-05-11 12:48 GMT

ఉ్రగవాదుల పాలిట సింహస్వప్నం...ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎందరో పెద్దలకు చుక్కలు చూపించిన ధీశాలి...అనేక సంచలనాత్మక కేసులను ధైర్యంగా పరిష్కరించి...మరెన్నో విపత్కర సంఘటనలను చిరునవ్వుతో ఎదుర్కున్న ఓ సీనియర్ పోలీసులు అధికారి ఎవరికీ అంతుచిక్కని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1988 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర అడిషనల్ డీజీ హిమాన్షు రాయ్ శుక్రవారం మధ్యాహ్నం దక్షిణ ముంబాయిలో తన నివాసంలో తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకున్నాడు. బుల్లెట్ చప్పుడు విన్న సిబ్బంది ఆయనను స్థానిక బాంబే ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. గత రెండేళ్లుగా బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న హిమాన్షు సంవత్సన్నరగా మెడికల్ లీవ్ పైన ఉన్నారు. చికిత్స కోసం ఆయన అమెరికా కూడా వెళ్లొచ్చారని తెలుస్తోంది.

ఎవరీ హిమాన్షు...?

1988 బ్యాచ్ కు చెందిన హిమాన్షు సీనియర్ పోలీస్ అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక కొంతకాలం ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేశారాయన. విధుల్లో చేరిన నాటి నుంచి అనేక కీలక సందర్భాల్లో ఉన్నతాధికారుల నుంచి ఆయన ప్రశంసలందుకున్నారు. ముఖ్యంగా ముంబయి పోలీస్ జాయింట్ కమిషనర్ గా ఉన్న సందర్భంలో హిమాన్షు ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును విచారించి రెజ్లర్ దారాసింగ్ కుమారుడు విందూ దారాసింగ్ ను, ఐసీసీ మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాధ్ మేయప్పన్ ను అరెస్టు చేశారు. మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ చీఫ్ గా పనిచేసిన సందర్భంగా ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించారు. ఓ పాఠశాలలో జరగాల్సిన ఉగ్రవాదుల దాడిని ముందుగానే పసిగట్టి భగ్నం చేసి ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఎప్పుడూ గుబురు మీసాలతో ధైర్యంగా ఉండే హిమాన్షు ఆత్మహత్యను ఆయన సన్నిహితులు నమ్మలేకపోతున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణాలను పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Similar News