స‌ర్పంచ్ చేసిన‌ ఛాలెంజ్ గురించి తెలుసా..?

Update: 2018-07-07 07:55 GMT

దేశంలో ఇటీవ‌ల ఫిట్ నెస్ ఛాలెంజ్ ఎంతగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిందో తెలిసిందే. అయితే, ఫిట్ నెస్ ఛాలెంజ్ కాదు, పొలంలోకి దిగి వ్య‌వ‌సాయం చేసి రైతు క‌ష్టం చూడండి అంటూ ఓ సర్పంచ్ చేసిన అగ్రిక‌ల్చ‌ర్ ఛాలెంజ్ ఇప్పుడు గోవా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ద‌క్షిణ గోవా ప్రాంతంలో అక్వెం బైక్సో పంచాయ‌తీ స‌ర్పంచ్ సిద్దేశ్ భ‌గ‌త్ ఈ ఛాలెంజ్ చేశారు. కేవ‌లం మంత్రులు, ఎమ్మెల్యేలు, క్రీడాకారులు మాత్ర‌మే వీఐపీలు కాద‌ని అస‌లైన వీఐపీలు రైతుల‌ని, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నెముక‌గా ఉన్న వ్య‌వ‌సాయం చేయాల‌ని, రైతుల క‌ష్టం చూడాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు.

పొలంబాట ప‌డుతున్న ఎమ్మెల్యేలు

ఈ ఛాలెంజ్‌ను ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి రాధామోహ‌న్ సింగ్‌, విరాట్ కోహ్లితో పాటు ఇత‌ర ప్ర‌ముఖుల‌కు ఈ ఛాలెంజ్ చేశారు. త‌న ఛాలెంజ్ ప్ర‌చారం కోసం చేసే జిమ్మిక్ కాద‌ని, రైతుల క‌ష్టాలు, వ్య‌వ‌సాయంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే లక్ష‌మ‌ని సిద్దేశ్ అంటున్నారు. సిద్దేశ్ స‌వాల్‌ని గోవాలో పార్టీల‌కు అతీతంగా ప్ర‌జాప్ర‌తినిధులు స్వీక‌రిస్తున్నారు. పొలాల్లోకి దిగి వ్య‌వ‌సాయం చేస్తున్నారు. మొద‌ట కాంగ్రెస్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో ఈ స‌వాల్‌ని స్వీక‌రించి పొలం దున్నారు. త‌ర్వ‌త రాష్ట్ర ఆర్థిక మంత్రి రోహ‌న్ ఖౌంటే కూడా స‌వాల్ స్వీక‌రించి పొలం దున్నారు. అయితే, బంజ‌రు భూముల‌ను సాగులోకి తీసుకురావ‌డ‌మే అస‌లైన వ్య‌వ‌సాయ స‌వాల్ అని గోవా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి విజ‌య్ స‌ర్దేశాయ్ అంటున్నారు.

Similar News