పోలీసుల తాట తీసేలా ఉన్నారే...!

Update: 2018-05-10 03:56 GMT

"ప్రజలు మనకు దేవుళ్లు.. మనకు జీతం ఇస్తున్న బాస్ లు.. జనాలతో సఖ్యతగా మలుచుకోండీ..గౌరవమర్యాదలకు లోటు లేకుండా చూడండీ.. కరుకైన మనస్తత్వాన్ని పక్కనపెట్టి.. స్నేహపూరితంగా మెలగండి".. ఇదీ ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి చెప్పే సూచనలు.. బట్ ఆ మాటలకు చెవికెక్కించుకోని పోలీసులు డిపార్టుమెంట్ పరువు తీస్తూనే ఉన్నారు.. దీనిపై హైదరాబాద్ సిపి సున్నితంగా ఎలా క్లాస్ పీకుతున్నారు.. కిందస్థాయి సిబ్బందిలో ఎలా మార్పు తీసుకు రాబోతున్నారు అన్న అంశంపై ఓ రిపోర్ట్.

స్టేషన్ కు వెళ్లాలంటే.....

పోలీస్.. ఈ మాట వినపడగానే ఖాకీ డ్రస్.. నెత్తిన టోపీ..చేతిలో లాఠీ.. కరుకైన గొంతుతో చెవులు తూట్లు పడే మాటలు.. అందుకే పోలీస్ అంటే జనాల్లో చాలా మందికి హడల్. అందులో ఇక స్టేషన్ కి రావాలని పిలువు వస్తే భయంతో వణికిపోయే వారు కొందరైతే.. మరికొందరికి పై ప్రాణాలు పైనే పోతాయి. స్టేషన్ కి వెళ్లామో.... లేని పోనీ కేసులంటూ కోర్టుల చుట్టు చక్కర్లు కొట్టాల్సి వస్తుందని హైరానా చెందుతారు.

మనస్థాపానికి గురైన అంజనీకుమార్.....

ఈ విధానంలో మార్పు తెచ్చేందుకు సిఎం కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేయగానే ఇచ్చిన మొదటి పిలువు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్.. దీన్ని ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలంటూ ఆర్డర్ కూడా వేశారు.. అందుకోసం నిత్యం అధికారులు నానా కసరత్తు చేస్తున్నా ఏక్కడో ఒక చోట ఏదో ఘటన జరిగి పోలీసు పరువు బజారున పడుతోంది.ఇటీవల వరుసగా తలెత్తిన ఘటనలు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి. డ్యూటీలో ఉన్న పోలీసులు వ్యాపారిని బెదిరించి పెట్రోలింగ్ వాహనంలో మద్యం తెప్పించుకోవడం, స్టేషన్ లో రికవరీ చేసిన గుట్కా సరుకును అమ్ముకోవడంపై ఆయన తీవ్ర కలత చెందారు.

వాయిస్ టేపులతో......

అంతే కాకుండా రెండురోజుల కిందట సివిల్ మ్యాటర్ లో తలదూర్చిన పోలీసులు వృద్ధ దంపతులను చిత్రహింసలు పెట్టి స్టేషన్ లో నిర్భందించిన సంఘటనపై సిపి అంజనీ కుమార్ షాక్ కి గురయ్యారు. పని తీరు నడవడిక మార్చుకోమంటూ మరోసారి ఆయన క్లాస్ పీకారు. జనం కోసం మనం అంటూ నడవడిక, ప్రవర్తనలో మార్పు తెచ్కుకోవాలని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.తాము చేసిన తప్పుల వల్ల మొత్తం డిపార్టుమెంట్ పరువు పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవమర్యాదలకు లోటు లేకుండా జనాలతో సఖ్యతగా నడుచుకొని పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలయ్యేలా చూడాంటూ అధికారులను ఆదేశించారు. అంతే కాదు పోలీసులపై మీడియాలో వచ్చే కథనాలను ఎప్పటికప్పుడు సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియచేయాలని, మీడియాకు వెంటనే వివరణ ఇవ్వడమే కాకుండా, దానిపై తనకు నివేదిక అందించాలని ఆర్డర్ పాస్ చేశారు. గత మూడురోజులుగా సిపి అంజనీ కుమార్ వాయిస్ టేపులు పోలీస్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇదిలావుంటే సామవేద దండోపాయంలా... ఇంత కూల్ గా చెప్తున్న సిపి ఎప్పుడో అధికారుల తాట తీయడం ఖాయం తెలుస్తోంది.

Similar News