కటీఫ్ తప్పదా? ఆత్మకూరుతో బీజం పడిందా?

ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడం ఖాయమైంది. తమ అభ్యర్థిగా భరత్ కుమార్ ను ప్రకటించింది.

Update: 2022-06-04 06:32 GMT

ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడం ఖాయమైంది. తమ అభ్యర్థిగా భరత్ కుమార్ ను ప్రకటించింది. నేడు నామినేషన్ కూడా ఆయన వేశారు. ఈ పరిస్థితుల్లో తన మిత్రపక్షమైన జనసేనను ఏమాత్రం బీజేపీ పోటీపై సంప్రదించలేదు. పవన్ కల్యాణ్ గతంలో బద్వేలు జరిగిన ఎన్నికల్లో కూడా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ ప్రచారానికి కూడా రాలేదు. బద్వేలు ఉప ఎన్నికలో ముందుగా పవన్ కల్యాణ్ ను బీజేపీ సంప్రదించింది.

జనసేనతో.....
అయితే ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా మాత్రం మిత్రపక్షమైన జనసేనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. పవన్ కల్యాణ్ తో సూచన ప్రాయంగా నయినా మాట్లాడలేదు. తమ అభ్యర్థిని నేరుగా ప్రకటించిన నామినేషన్ వేయించింది. జనసేన మాత్రం ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంటుంది. మేకపాటి కుటుంబానికే టిక్కెట్ ఇవ్వడంతో పోటీ చేయబోమని, గతంలోనూ బద్వేలులో ఇదే నిర్ణయం తీసుకున్నామని జనసేన నేతలు చెబుతున్నారు.
సంప్రదింపులు లేకుండా....
బద్వేలు ఉప ఎన్నికలో జనసేనాని ప్రచారానికి రాకపోయినా అక్కడ జనసేన కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు. కానీ ఆత్మకూరులో ఆ పరిస్థితి లేదంటున్నారు. పవన్ కల్యాణ్ నుంచి ఎటువంటి సమాచారం తమకు లేదని, తమ నాయకుడు పిలుపు మేరకు తాము నిర్ణయం తీసుకుంటామని స్థానిక జనసేన నేతలు చెబుతున్నారు. ఆత్మకూరులో బీజేపీ, జనసేనలకు పెద్దగా ఓటు బ్యాంకు లేదు. అక్కడ వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. ఇక్కడ గెలుపు అంత సులువు కాదని, సెంటిమెంట్ ఉండటంతో కనీసం డిపాజిట్లు అయినా దక్కేవిధంగా చేసుకోవాలంటే జనసేన మద్దతు అవసరం. అయినా ఏమాత్రం సంప్రదింపులు జరపలేదు.
ఈ ఎన్నిక తర్వాత...?
ఆత్మకూరు ఉప ఎన్నికతో బీజేపీ, జనసేన మధ్య మరింత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ కూడా ఇక్కడి నేతలతో తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, ఢిల్లీలో ఉన్న నేతలతోనే తాను ఏ అంశంపైనైనా చర్చిస్తానని నిన్ననే పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నికలో తన మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నా జనసేన మాత్రం మౌనంగా ఉండటం రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని చెప్పాలి. ఆత్మకూరు ఉప ఎన్నికతో జనసేన బీజేపీకి కటీఫ్ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.


Tags:    

Similar News