ఆ ముఖ్యమంత్రి ఓ ‘ట్రాజెడీ కింగ్’

Update: 2018-07-17 07:28 GMT

తక్కువ సీట్లు వచ్చినా అనూహ్య పరిణామాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన హెచ్.డీ కుమారస్వామిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సానుభూతి చూపారు. కుమారస్వామి ఒక ‘ట్రాజెడీ కింగ్’ అంటూ వ్యాఖ్యానించారు. కుమారస్వామి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన ఆవేదనను వెల్లగక్కి, ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టినందుకు జేడీఎస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నా, తానకు మాత్రం సంతోషం లేదని, విషం గొంతులో పెట్టుకుని శివుడు ఎంత బాధ అనుభవించాడో తానూ ముఖ్యమంత్రి పదవి చేపట్టి అంతేబాధను అనుభవిస్తున్నానని వ్యాఖ్యానించారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటూ ఇంతే...

ఈ నేపథ్యంలో స్పందించిన అరుణ్ జైట్లీ కుమారస్వామి పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. భవిష్యత్ లో కాంగ్రెస్, ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జరగబోయే దానికి కర్ణాటక పరిణామాలు ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. మోడీకి వ్యతిరేకంగా 2019లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను ఆయన తేలిగ్గా తీసుకున్నారు. గతంలో మాజీ ప్రధానులు చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ కు కాంగ్రెస్ ఏవిధంగానైతే ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు కుమారస్వామికి కూడా అదేవిధంగా చేస్తోందని పేర్కొన్నారు.

Similar News