క్రేన్లు, డ్రోన్లు, డప్పులు.. 'అన్న' బర్త్ డేకి అనుచరుల హంగామా, రోడ్డంతా రచ్చ

దండలు మోసుకొచ్చిన క్రేన్లు.. వాటిని షూట్ చేసేందుకు డ్రోన్లు.. వీధి నిండా డప్పులు.. నేతల స్టెప్పులతో ఆ వీధి మార్మోగింది.

Update: 2022-05-05 11:08 GMT

ఏడాదికొకసారి వచ్చే పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. అదే రాజకీయ పార్టీ నేత బర్త్ డే అయితే సెలబ్రేషన్స్ మరో రేంజ్‌లో ఉంటాయి. తమ అంగబలం.. అర్థబలం చూపించుకునేందుకు అదో ప్రత్యేకమైన అవకాశం. ఆ రోజు తమ నేతను విష్ చేసేందుకు వచ్చే నాయకులు, కార్యకర్తల హంగామా కూడా మామూలుగా ఉండదు. బొకేలు.. పూలదండలు.. శాలువాలతో ముంచెత్తుతారు. పదవిలో ఉన్న తమ నేత ఆశీస్సుల కోసం ఆరోజు ఆయన్ను పలకరించేందుకు క్యూలు కడుతుంటారు.

నేతలు సైతం పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇష్టపడతారు. అదే సదరు నేత అధికార పార్టీలో ఉంటే ఇక ఆ వేడుకలు పీక్స్‌లో ఉంటాయి మరి. అధికార టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బర్త్ డే వేడుకలు కూడా అదే రేంజ్‌లో జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుచరులు భారీ ఏర్పాట్లతో హంగామా చేశారు.

ఆయన నివాసం వద్దకు అనుచరగణం భారీగా తరలివచ్చింది. ఆయనకు వేసేందుకు భారీ దండలు, వాటిని మోసుకొచ్చిన క్రేన్లు.. అవన్నీ షూట్ చేసేందుకు డ్రోన్లు, భారీ లౌడ్ స్పీకర్లు.. డప్పు వాయిద్యాలతో ఆ ప్రాంతం మార్మోగింది. రోడ్డుపై అనుచరుల హంగామాతో కోలాహలం నెలకొంది. వచ్చీపోయే జనం ఆ హడావిడి చూసి ముక్కున వేలేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈసారి సారు ఎమ్మెల్యే రేసులోనూ ఉన్నారని చెప్పుకుంటున్నారు. మరి ఆ మాత్రం హడావిడి ఉండాల్సిందేగా!!



Tags:    

Similar News