Telangana : తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్..రేషన్ కార్డు కావాలంటే?
తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి సమయం లేదని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ రేషన్ కార్డులు లేని వారంతా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వీలుంది. దీంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను గతంలో స్వీకరించిన ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేసి అందులో అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేసింది. తెలుపు రంగు రేషన్ కార్డు కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలో14.40 లక్షల కొత్త కార్డులు మంజూరు చేసింది. మరిన్ని కార్డులను మంజూరు చేస్తానని చెబుతోంది.
లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లోనే...
ఇప్పటికే గ్రామ సభలద్వారా, మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు చేసుకున్నారు. లక్షలాది మంది తెలుపు రంగు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ దఫా రేషన్ కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నా చాలా మందికి అందకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. ఈ దశలో ప్రభుత్వం ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన వారిని పరిశీలించి వారికి రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటికి పైగా యాక్టివ్ రేషన్ కార్డులున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
తెలుపు రంగు కార్డు కోసం...
తెలంగాణలోని ప్రభుత్వం అందించే అనేక పథకాలకు తెలుపు రంగు రేషన్ కార్డు కావాల్సి ఉండటంతో పాటు సన్న బియ్యం తమకు అందుతుందని, విద్యుత్ ఉచితంగా అందుతుందని, దీంతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కూడా అందుతున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం అందుతుండటంతో ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అనేక కారణాల వల్ల తమకు ఇప్పటి వరకూ రేషన్ కార్డులు ఇవ్వలేదని, గత ప్రభుత్వం అసలు రేషన్ కార్డులే మంజూరు చేయలేదని, ఇప్పుడైనా తమ పేదరికం చూసి ఇవ్వాలని చాలా మంది నిరుపేదలు సర్కార్ ను కోరుతున్నారు. మరి పథకాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి రేషన్ కార్డులు ఎంత వరకూ మంజూరు చేస్తుందన్నది చూడాలి.