SLBC Accident : ఏడుగురి మృతదేహాలు దొరకడం ఇక దుర్లభమేనా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ కు సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ కు సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏడుగురు కార్మికుల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది. కార్మికులు టన్నెల్ లో ప్రమాదానికి గురై నేటికి ఇరవై మూడో రోజుకు చేరుకున్నా ఏడుగురి జాడ తెలియడం లేదు. కనీసం వారి మృతదేహాలను కనుగొనడం కూడా సాధ్యం కావడం లేదు. ఎటు చూసినా బురద నిండుకుని పోవడంతో దానిని తొలగించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం పన్నెండు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఏ మాత్రం ఫలితం కనిపించడం లేదు.
నలభై మీటర్ వద్ద...
చివరి నలభై మీటర్లు ప్రమాదకరంగా మారాయి. అక్కడ తవ్వకాలు జరపాలంటే సహాయక బృందాలకు సాధ్యం కావడం లేదు. సహాయక చర్యలు చేపట్టాలంటే వారు రిస్క్ లో పడే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో రోబోలను తెచ్చారు. కేరళ నుంచి ప్రత్యేకించి జాగిలాలను రప్పించారు. అయినా ఇంత వరకూ జాడ తెలియడం లేదు. ఇక టన్నెల్ లో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు వ్యాక్యూయ్ ట్యాంక్ ను టన్నెల్ లోకి తీసుకు వచ్చారు. దీని ద్వారా త్వరగా బురదను తొలగించవచ్చని భావిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తయినా సహాయక చర్యలు మాత్రం ఊపందుకోలేదు.
బురద తొలగించేందుకు...
కేరళ శునకాలు గుర్తించిన ప్రాంతాల్లోనే మృతదేహాలు ఉంటాయని సహాయక బృందాలు భావిస్తున్నాయి. అక్కడ పూర్తి స్థాయి తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించినా అక్కడ సాధ్యం కావడం లేదు. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా తమ వంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దాదాపు తొమ్మిది మీటర్లు పేరుకుపోయిన బురదను తొలగించాలంటే మనుషుల వల్ల అయ్యే పనికాదు. కేవలం యంత్రాలు మాత్రమే చేయాల్సిన పని అని అధికారులు చెబుతున్నారు. ఆదివారం నుంచి ఈ బురద తొలగించే పనులు మరింత వేగవంతంగా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంకెంత కాలం అనేది ఎవరూ చెప్పలేకుండా ఉంది.