బెంగాల్ వ్యూహాన్ని తిప్పికొడతాం

పార్టీలో చేరుతున్న వారికి ఎలాంటి టిక్కెట్ హామీ ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2022-07-05 08:08 GMT

పార్టీలో చేరుతున్న వారికి ఎలాంటి టిక్కెట్ హామీ ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశమయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీలో చేరుతున్న వారికి టిక్కెట్ హామీ ఇస్తున్నారనడం వాస్తవం కాదన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి పార్టీ హైకమాండ్ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ఖరారు చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చేరికలపై తాము దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.

పార్టీలను చీల్చేందుకే...
పార్టీలను చీల్చడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించేందుకు మమత బెనర్జీ సమావేశం పెడితే డుమ్మా కొట్టిన కేసీఆర్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పెరిగిన తర్వాత యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. పశ్చిమబెంగాల్ వ్యూహాన్ని ఇక్కడ అమలుపర్చాలని భావిస్తున్నారన్నారు. అక్కడ మమత గెలిచేందుకు బీజేపీని ప్రధానశక్తిగా ప్రశాంత్ కిషోర్ చేశారని, అలాగే ఇక్కడ కూడా కేసీఆర్ బీజేపీని ప్రతిపక్ష స్థానంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ వ్యూహం తెలంగాణలో నడవదని చెప్పారు.
సెప్టంబరులో రాహుల్...
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని చెప్పారు. త్వరతో దళిత గర్జన, విద్యార్థి నిరుద్యోగ గర్జనలపై కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. సెప్టంబరు నెలలో మరోసారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ జనం తమ వెంటే ఉన్నారని చాటి చెబుతామని రేవంత్ చెప్పారు.


Tags:    

Similar News