Telangana : కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభ కీలక నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది

Update: 2025-09-01 01:45 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. ఈ సభలో అన్ని పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎ.ఫ్.సి భాగస్వామ్యులై ఉన్నందున కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్న వారిని ప్రజల ముందు దోషులుగా పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

అవకతవకలకు కారకులైన వారిని...
తమ్మడిహట్టి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీని మేడిగడ్డకు మార్చడంలో మతలబుతో పాటు, అనేక ఆర్థిక అవకతవకలకు కారణమైన వారిని నిగ్గు తేల్చాలంటే సీబీఐ ఒక్కటే మార్గమని శాసనసభ భావించినట్లు ముఖ్యమం్తరి తెలిపారు. ఇందుకు కారకులైన వారికి శిక్షపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. ఊరు, పేరు, అంచనాలను మార్చి ప్రజాధనాన్ని దోచుకున్న వారిని శిక్షించడం వల్ల భవిష్యత్ లో ఇలాంటి తప్పిదాలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ కాళేశ్వరం కమిషన్ లో జరిగిన అవకతవకలపై ఎన్.డి.ఎస్.ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు అధికారులను కూడా తప్పుపట్టిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ....
రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే అది రాజకీయ కక్ష కింద మలచే అవకాశమున్నందున అలాంటి అనుమానాలకు తావులేకుండా, నిందితులు రాజకీయ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ చేత దర్యాప్తు జరపడం సముచితమని సభ అభిప్రాయపడిందని, ఈ మేరకు సీబీఐకి ఈ కేసును అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టకూడదని తమ ప్రభుత్వం ఆలోచన అన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సాగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.















Tags:    

Similar News