Kavitha : కవిత కూడా .. షర్మిల తరహాలోనే నష్టం చేకూరుస్తారా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సొంత పార్టీపై కసరత్తులు ప్రారంభించారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సొంత పార్టీపై కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే కల్వకుంట్ల కవిత తన ఇంటి పేరును మార్చుకున్నారు. ఇక కేసీఆర్ ఫొటో కూడా తన కార్యాలయంలో తీసేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కవిత సొంత పార్టీ ప్రకటన త్వరలోనే వెలువడుతుందని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొందరు మేధావులు, బీఆర్ఎస్ లో అసంతృప్త నేతలతో కవిత సమావేశమై చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆమె ఫిబ్రవరి నెలలో కాని మార్చి లో కానీ మంచి ముహూర్తం చూసి పార్టీ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీ పేరును కూడా దాదాపుగా ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
జగన్ ను డ్యామేజీ చేసి...
అయితే కవిత మరో షర్మిల కానున్నారన్న కామెంట్స్ ఎక్కువగా కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల కూడా కవిత తరహాలోనే తన అన్నతో విభేదించి ప్రత్యేక పార్టీ తెలంగాణలో పెట్టారు. అయితే ఆమె తర్వాత కాంగ్రెస్ లోకి మారారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో సింగిల్ సీటు కూడా సాధించలేకపోయారు షర్మిల. అయితే తన సోదరుడైన వైఎస్ జగన్ పార్టీని చాలా వరకూ డ్యామేజీ చేయగలిగారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ఓటమికి ఆయన పరిపాలనలో తీసుకున్ననిర్ణయాలతో పాటు షర్మిల ప్రభావం కూడా ఎక్కువగా ఉందన్నది వాస్తవం.
కొత్త పార్టీ పెట్టినా...
ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లోనూ కవిత సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే కవిత కొత్త పార్టీ కూడా షర్మిల తరహాలోనే తెలంగాణలోనూ పెద్దగా ఫలితాలు సాధించే అవకాశాలు లేవన్నది వాస్తవం. అయితే బీఆర్ఎస్ పార్టీని మాత్రం కొంత వరకూ డ్యామేజీ చేసే అవకాశాలున్నాయన్నది వాస్తవం. అయితే ఎంత వరకూ పార్టీకి నష్టం చేకూరుస్తుంది? లేకుంటే ఇంకా ఎన్నికలకు సమయం ఉండటంతో తన తండ్రి కేసీఆర్ తో రాజీ కుదుర్చుకుంటారా? అన్నది తెలియకపోయినా కొత్తగా పార్టీ అంటూ పెడితే మాత్రం ఎంతో కొంత బీఆర్ఎస్ కు నష్టం చేకూరుస్తుందని చెప్పక తప్పదు. మరి కవిత చేకూర్చే నష్టం నుంచి బీఆర్ఎస్ ను ఎలా పార్టీని కాపాడుకుని ముందుకు వెళతారన్నది చూడాలి.