కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఆగమాగం: జేపీ నడ్డా

కేసీఆర్ కుటుంబ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్‌గా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.

Update: 2023-06-25 13:05 GMT

కేసీఆర్ కుటుంబ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్‌గా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే బడుగు బలహీన వర్గాల వారికి సహకారం అందుతోందన్నారు. తెలంగాణకు మోదీ పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన నవ సంకల్ప బహిరంగ సభలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఎందరో ఉద్యమకారులకు నడ్డా నివాళులు తెలిపారు. ఉద్యమకారులు కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఒక కుటుంబం దేశాన్ని పట్టిపీడిస్తోందని సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు దుఃఖంలో ఉన్నారని, కేసీఆర్‌ ఆయన కుమారుడు, కుమార్తె మాత్రమే సంతోషంగా ఉన్నారని అన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్థి పథం వైపు దూసుకెళ్తుంటే.. కేసీఆర్‌ పాలనతో తెలంగాణ ఆగమైపోతోందన్నారు. తెలంగాణను కేసీఆర్‌ నాశనం చేశారని జేపీ నడ్డా ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, వీరిని జైలుకు పంపాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ పాలనలో దేశం పురోగమిస్తోందని, పేదరికం 20 నుంచి 10 శాతానికి తగ్గిందని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని జేపీ నడ్డా తెలిపారు.

మోదీ ప్రభుత్వం 80 మంది ప్రజలకు రేషన్‌ అందిస్తోందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు అంకితమని జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మోదీ 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారని, ఆయుష్మాన్ పథకంతో ఎంతో మందికి బీమా కల్పించారనిఅన్నారు. తెలిపారు. కమల వికాసంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు అందిస్తున్నామని చెప్పారు. ఐటీ, ఆటోమొబైల్‌ సహా అన్ని రంగాల్లోనూ భారత్‌ దూసుకెళ్తోందన్నారు. మోదీని గ్లోబల్‌ లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతోందని జేపీ నడ్డా అన్నారు. ప్రపంచ నాయకులు ‘మోదీ మా లీడర్’ అని చెప్పుకుంటుంటే.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆయన్ను ‘చాయ్ వాలా, చదువు లేనోడు’ అంటూ విమర్శిస్తున్నారని జేపీ నడ్డా మండిపడ్డారు.

కోవిడ్‌, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినా.. మోదీ చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానంలో ఉన్న భారత్‌ను మోదీ ఐదో స్థానంలోకి తెచ్చారని అన్నారు. మోదీ ముందు చూపు చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ఠంగా మారిందన్నారు. తన ప్రసంగంలో సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వందేభారత్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయాన్ని జేపీ నడ్డా గుర్తు చేశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం రూ.4,400 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను మోదీ ఇచ్చారని జేపీ నడ్డా గుర్తు చేశారు. 

Tags:    

Similar News