Telangana : తెలంగాణలో బీజేపీకి ఇక మంచి రోజులు వచ్చినట్లేగా?

తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఫుల్లు హ్యాపీగా ఉంది

Update: 2026-01-20 12:44 GMT

తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఫుల్లు హ్యాపీగా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తాము అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమమవుతుందని భావిస్తుంది. తాము పెద్దగా కష్టపడకపోయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నట్లు అంచానాల్లో కమలం పార్టీ నేతలున్నారు. రోజులు గడిచే కొద్దీ బీజేపీ అధికారానికి దగ్గరవుతుందున్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ పరవాలేదనిపించిన బీజేపీ త్వరలో రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉందన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది.

బీఆర్ఎస్ పై ఆ ముద్ర...
గతంలో దాదాపు పదేళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పై కుటుంబ పార్టీగా ముద్ర పడింది. అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో కలవకపోవడంతో పాటు కేవలం ప్రగతి భవన్ కే పరిమితమవ్వడం కూడా జనంలో వ్యతిరేకతకు కారణమయింది. మరొకవైపు సంక్షేమ పథకాలను, అభివృద్ధిని పరుగులు పెట్టించినా కేసీఆర్ నాయకత్వం అవలంబించిన నియంతృత్వ పోకడలు ఆ పార్టీని దెబ్బతీశాయని చెప్పాలి. ఇక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య కార్యకర్తలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో చెలరేగిన తీరు, అక్రమంగా సొమ్ములు కూడబెట్టుకున్న తీరు కూడా పార్టీ ఓటమికి దారి తీసిందని భావించాలి. అందుకే కేసీఆర్ ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ప్రజలు మూడో సారి ఆదరించలేదు.
కాంగ్రెస్ పై ఆరోపణల నేపథ్యంలో...
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే ఎన్నో ఆరోపణలు కాంగ్రెస్ నేతలపై వస్తుండటం కూడా పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఆరు గ్యారంటీలను సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు అనేక రాజకీయ పరిణామాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయంటున్నారు. రెండేళ్లకే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తే..మరో మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పక్కన పెడతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయం తామేనని, ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూసిన ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కు పట్టం కడతారని కమలనాధులు అంచనా వేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇదే అంచనాలో ఉంది. త్వరలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News